అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' వస్తోంది
పండగల సీజన్ అంటే అమ్మకాల సీజన్. ఈ సీజన్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు. అయితే ఇది ప్రతి ఏటా ఉండేదే. సహజంగా పండగ వచ్చిందంటే చాలా మంది కొత్త వస్తువులు కొనటానికి ఆసక్తిచూపుతారు. దీన్ని ఆసరాగా తీసుకునే ఈ సంస్థలు ఆఫర్స్ తో ముందుకొస్తాయి. అంతే కాదు..వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తాయి. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ నెల రోజుల పాటు సేల్ కు తెరతీసింది. ఈ మేరకు తాజాగా ప్రకటన చేసింది. అక్టోబర్ 4 నుంచి ఇది ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కు ప్రత్యేక డీల్స్ ఉంటాయని కూడా వెల్లడించింది.
గ్రేట్ ఇండియన్ సేల్ లో మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, స్మార్ట్ టీవీల వంటి వాటిపై ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నాయి. దీంతోపాటు ప్రత్యేకంగా ఆపిల్, శాంసంగ్ తదితర బ్రాండ్లను కూడా ఈ ఆఫర్ లో అందుబాటులో ఉంచనున్నారు. అమెజాన్ తన ఆఫర్ లో హెచ్ డీఎఫ్ సీ కార్డు హోల్డర్లకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నారు. అత్యంత కీలకమైన దసరా, దీపావళి పండగల సమయం అంతా ఈ ఆఫర్ కొనసాగనుందని అమెజాన్ వెల్లడించింది. మరో ప్రముఖ సంస్థ ఫ్లిప్ కార్ట్ కూడా అక్టోబర్ 7 నుంచి ప్రత్యేక సేల్ ప్రారంభించనున్నట్లు తెలిపింది.