Telugu Gateway
Top Stories

వణికించిన అలస్కా ఎయిర్ లైన్స్

వణికించిన అలస్కా ఎయిర్ లైన్స్
X

స్పీడ్ గా వెళ్లే కార్ డోర్ ఊడిపడితేనే అందులో ఉన్న వాళ్ళు షాక్ అవుతారు. అలాంటిది ఏకంగా పదహారు వేల అడుగుల ఎత్తులో వెళుతున్న విమానం డోర్ అకస్మాత్తుగా ఊడిపడిపోతే అందులోని ప్రయాణికుల పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. నిజంగానే అలాంటి షాకింగ్ ఘటన జరిగింది అమెరికాలో. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఒక బోయింగ్ విమానం డోర్ ఊడిపోయింది. దీంతో అందరు ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అలస్కా ఎయిర్ లైన్స్ కు చెందిన ఈ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అమెరికా లోని పోర్ట్ ల్యాండ్ నుంచి ఒంటారియోకు బయలు దేరిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డోర్ ఊడిపడిన సమయంలో ఆ విమానంలో ఏకంగా 171 మంది ప్రయాణికులు..ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఊహించని ఈ పరిణామంపై విచారణ జరపనున్నట్లు అలస్కా ఎయిర్ లైన్స్ ప్రకటించింది. అలస్కా ఎయిర్ లైన్స్ విమానం డోర్ ఊడిపడిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

డోర్ ఊడిపడిన సమయంలో పక్కనే కూర్చుని ఉన్న ప్రయాణికుల ఫోన్లు ఎగిరిపడిపోయినట్లు కొంత మంది ప్రయాణికులు వెల్లడించారు. ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే డోర్ ఊడి పడిపోయిన తర్వాత తాము బతికి బయటపడతామని ఊహించలేదు అని కొంత మంది ప్రయాణికులు వెల్లడించారు. ఈ విమానంలో ఉన్న చాలా మంది ఈ అనూహ్య పరిణామంతో వణికిపోయారు. డోర్ .ఊడిపడిపోవటంతో లోపలికి బలంగా గాలులు వస్తాయని..ఇది ఎవరినైనా తీవ్ర ఆందోళనలోకి నెట్టే పరిణామమే అని ఏవియేషన్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే ఇది బ్రాండ్ న్యూ విమానం. రెండు నెలల క్రితమే ఈ ఫ్లైట్ అలస్కా ఫ్లీట్ లో చేరింది.

Next Story
Share it