ఆకాశ ఎయిర్ లైన్స్..డెబ్బయ్ విమానాలు
స్టాక్ మార్కెట్ తో పరిచయం ఉన్న వారు ఎవరికీ రాకేష్ ఝున్ ఝున్ వాలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ స్టాక్ మార్కెట్లో ఆయన పెట్టుబడి పెట్టిన షేర్లు ఏవో తెలుసుకుని ఇన్వెస్టర్లు వాటినే కొనుగోళ్లు చేస్తారనటంలో సందేహం లేదు. ఆయన బెట్టింగ్ లపై అంత నమ్మకం కొంత మందికి. అయితే ఎక్కువ శాతం ఆయన పెట్టుబడి పెట్టిన షేర్లు లాభాలే తెచ్చిపెట్టాయని చెబుతాయి మార్కెట్ వర్గాలు. ఈ బిలియనీర్ ఇన్వెస్టర్ ఇప్పుడు విమానయాన రంగంలోకి ప్రవేశిస్తున్నారు. కరోనా కారణంగా..అంతకు ముందు కూడా విమానయాన రంగం ఏమంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ రాకేష్ ఝున్ ఝున్ వాలా కొత్తగా ఎయిర్ లైన్స్ ప్రారంభించే పనిలో ఉన్నారు. ఈ ఎయిర్ లైన్స్ కు మరో పక్షం రోజుల్లోనే ఎన్ వోసీ రావొచ్చని సమాచారం. చౌకధరల విమానయాన సంస్థగానే ఆయన దీన్ని తీర్చిదిద్దనున్నారు. అదే సమయంలో ఆకాశ ఎయిర్ పేరుతో ప్రారంభిస్తున్న ఈ ఎయిర్ లైన్స్ నాలుగేళ్ళలో 70 విమానాలను సమకూర్చుకోనుందని తెలిపారు. ఇందులో ఆయన వాటా 40 శాతంగా ఉండబోతుంది.
ఒక్కో విమానం 180 మంది ప్రయాణికులను తీసుకెళ్ళే సామర్ధ్యం కలిగి ఉంటాయని రాకేష్ వెల్లడించినట్లు బ్లూమ్ బెర్గ్ టీవీ ఇంటర్వ్యూని ఉటంకిస్తూ లైవ్ మింట్. కామ్ కథనాన్ని ప్రచురించింది. దేశీయ విమానయాన రంగ డిమాండ్ కు సంబంధించి తాను ఎంతో బుల్లిష్ గా ఉన్నట్లు ఆయన తెలిపారు. తమ ఎయిర్ లైన్స్ లో భాగస్వాములు ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన ఎయిర్ లైన్స్ కు చెందిన వారు ఉన్నారని తెలిపారు. అయితే ప్రపంచం అంతా విమానయాన రంగం తీవ్ర చిక్కుల్లో ఉన్న సమయంలో రాకేష్ ఝున్ ఝున్ వాలా కొత్త ఎయిర్ లైన్స్ ప్రయోగానికి దిగటంపై అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. దేశీయ విమానయాన రంగంలో కూడా ఒకప్పుడు వెలుగువెలిగిన కింగ్ ఫిషర్, జెట్ ఎయిర్ వేస్ మూతపడిన విషయం తెలిసిందే.