Telugu Gateway
Top Stories

ఎయిర్ టెల్ ప్రీ పెయిడ్ ఛార్జీల పెంపు

ఎయిర్ టెల్ ప్రీ పెయిడ్ ఛార్జీల పెంపు
X

దేశంలోని అగ్ర‌శ్రేణి టెలికం కంపెనీలు గ‌త కొంత కాలంగా తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయి. మార్కెట్ పోటీ ఓ వైపు..ధ‌ర‌ల యుద్ధం కార‌ణంగా భారంగా ముందుకు సాగుతున్నాయి. ఈ త‌రుణంలో ప్ర‌ముఖ టెలికం సంస్థ భార‌తీ ఎయిర్ టెల్ ఛార్జీల పెంపు నిర్ణ‌యం తీసుకుంది. భ‌విష్య‌త్ పెట్టుబ‌డులు, 5జీ సేవ‌ల ప్రారంభం త‌దిత‌ర అంశాల‌కు ఛార్జీల స‌వ‌ర‌ణ త‌ప్ప‌నిస‌రి అని కంపెనీ పేర్కొంది. సోమ‌వారం నాడు ప్రీ పెయిడ్ టారిఫ్‌ రేట్లను పెంచుతూ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ప్రీపెయిడ్‌ టారిఫ్‌ను 20 నుంచి 25 శాతం, డాటా టాప్‌ అప్‌ ప్లాన్‌ల మీద 20 నుంచి 21 శాతం పెంచేసింది. ప్రతి ప్యాక్‌ మీద పది రూపాయల మినిమమ్‌ పెంపును ప్రకటించింది. ఆరోగ్యకరమైన ఆర్థిక పోటీలో భాగంగానే ఈ పెంపుదల నిర్ణయం తీసుకున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ సోమవారం ప్రకటించింది. 28 రోజుల వాలిడిటీతో ఉన్న మినిమమ్‌ టారిఫ్‌ ప్రస్తుతం 79రూపాయ‌లు ఉండగా, అది రూ.99 కానుంది. ఇక డాటా టాప్‌ అప్స్‌లో 48 రూ. అన్‌లిమిటెడ్‌ 3జీబీ డాటా ప్యాక్‌ను 58రూ. లకు పెంచేసింది. నవంబర్‌ 26 నుంచి పెరిగిన ఈ ధరలు టెలికామ్‌ సబ్‌స్క్రయిబర్స్‌కు వర్తించనున్నాయి.

యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌(ARPU) కింద 200 నుంచి 300 రూపాయ‌లు అవుతోందని, ఈ లెక్కన ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే టారిఫ్‌లను పెంచక తప్పలేదని భారతీ ఎయిర్‌టెల్‌ స్పష్టం చేసింది. టారిఫ్ పెంపు మౌలిక సదుపాయాలలో "గణనీయమైన పెట్టుబడులకు మార్గం వేస్తుంద‌ని, భారతదేశంలో 5G స్పెక్ట్రమ్‌ను విడుదల చేయడంలో సహాయపడుతుందని సోమవారం ఓ ప్రకటన ఎయిర్‌టెల్ వెల్ల‌డించింది. టారిప్ పెంపు ప్ర‌క‌ట‌న‌లో స్టాక్ మార్కెట్లో ఎయిర్ టెల్ షేర్లు పెరిగాయి. అయితే ఈ ఛార్జీల పెంపు ప్ర‌భావం కంపెనీపై ఏ మేర‌కు ఉంటుంది అనే అంశం కొద్ది కాలంపోతే కానీ తెలియ‌దు. పోటీ సంస్థ‌లు కూడా ఎయిర్ టెల్ త‌ర‌హాలో ఛార్జీలు పెంచితే పెద్ద‌గా న‌ష్టం ఉండ‌దు. కానీ అవి ఎయిర్ టెల్ క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు చేస్తే మాత్రం ఎంత మంది యూజ‌ర్లు అటువైపు షిఫ్ట్ అవుతారు అన్న‌ది వేచిచూడాల్సిందే.

Next Story
Share it