సెకండ్ పైలట్ ప్లేస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ !
ఈ దిశగా ఎయిర్ బస్ చర్యలు ప్రారంభం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్క ఐటి రంగంలోనే కాదు...మొత్తం పారిశ్రామిక రంగంలో కూడా ఎన్నో మార్పులకు కారణం కాబోతోంది. ఏవియేషన్ రంగం కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఆటోమేషన్...ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఇక నుంచి విమానాలను కూడా ఒక్క పైలట్ తోనే నడిపేందుకు దిగ్గజ విమాన తయారీ సంస్థ ఎయిర్ బస్ సన్నాహాలు ప్రారంభించింది. మరో పైలట్ స్థానంలో ఆటోమేషన్...ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ఒక్క పైలట్ తోనే విమానాలు నడిపేందుకు వీలుగా విమానాలను తయారు చేయటానికి సిద్ధం అవుతోంది. మాములుగా అయితే ప్రతి విమానంలో ఇద్దరు పైలట్స్ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఇందులో ఒకరు కెప్టెన్ అయితే...మరొకరు ఫస్ట్ ఆఫీసర్. దేశీయ విమానాలతో పాటు అంతర్జాతీయ విమానాల్లో కూడా ఇదే పద్ధతి పాటిస్తారు. అయితే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల జర్నీ ఉండే అంతర్జాతీయ విమానాల్లో కొన్ని సార్లు మూడవ పైలట్ కూడా ఉంటారు. ఇది ఆయా ఎయిర్ లైన్స్ ...ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ వంటి అంశాల ఆధారంగా ఉంటుంది.
ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ సింగిల్ పైలట్ ఫ్లైట్స్ ను తీసుకొచ్చే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రపంచంలోనే విమానాల తయారీలో పేరున్న కంపెనీలు అంటే ఎయిర్ బస్, బోయింగ్ కంపెనీల పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. అయితే ఇండియా లో సేవలు అందిస్తున్న ఎయిర్ లైన్స్ ఎక్కువగా అంటే డెబ్భై శాతం పైగా వాడేది ఎయిర్ బస్ ఫ్లైట్స్ నే . దేశంలో అతి పెద్ద ఎయిర్ లైన్స్ అయిన ఇండిగో, ఎయిర్ ఇండియా, ఇటీవల ఎయిర్ ఇండియా లో విలీనం అయిన విస్తార ఎయిర్ లైన్స్ కూడా ఎక్కువగా ఎయిర్ బస్ విమానాలనే వాడతాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఎయిర్ లైన్స్ వందల సంఖ్యలో కొత్త విమానాలకు కూడా ఆర్డర్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఎయిర్ బస్ 2030 మధ్య నుంచి అంటే ఇంకో ఐదేళ్లలోనే దూర ప్రాంత సర్వీసుల్లో సైతం సింగిల్ పైలట్ ఫ్లైట్స్ ను ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉంది. రెండవ పైలట్ బదులు ఆటోమేషన్, ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది.
అవసరం అయినప్పుడు గ్రౌండ్ బేస్డ్ పైలట్ సర్వీసులను ఉపయోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ( ఈఏఎస్ఏ) అత్యంత కఠిన పరీక్షల ద్వారా ఈ సాంకేతిక పరిజ్ఙానం, సేఫ్టీ సర్టిఫికేషన్ వంటి అంశాలను పరిశీలిస్తోంది. సింగిల్ పైలట్ ఆపరేషన్స్ ద్వారా ఎయిర్ లైన్స్ కు ఎంతో ఆదా అయ్యే అవకాశం ఉంది అని ఒక అంచనా. దీని ద్వారా పైలట్ వ్యయాలకు సంబంధించిన వ్యయం పదిహేను శాతం వరకు తగ్గవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ మార్పులను అమలు చేసేందుకు నిబంధనలను మార్చుకోవటంతో పాటు ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టం లో కూడా ఎన్నో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది అని..ఇది ఎంతో సంక్లిష్టతలతో కూడిన వ్యవహారంగా భావిస్తున్నారు.
ఇండియా లో పైలట్ ల కొరత ఎక్కువగా ఉంది. ఎయిర్ బస్ కొత్త మోడల్ వల్ల కో పైలట్స్ డిమాండ్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో ఈ కొత్త సిస్టం వల్ల పైలట్స్ కు రిమోట్ పైలట్ ఆపరేషన్స్, ఏఐ సిస్టమ్స్ లో శిక్షణ వంటివి అవసరం అవుతాయి. 2040 నాటికి ఇండియా కు కొత్తగా 31000 మంది పైలట్స్ అవసరం అవుతారు అనే లెక్కలు ఉన్నాయి. అయితే సింగిల్ పైలట్ ఆపరేషన్స్ వల్ల భద్రతా ఆందోళనలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇండియాలో అయితే ప్రయాణికులు సింగిల్ పైలట్ ఫ్లైట్స్ వల్ల అసౌకర్యానికి గురి అయ్యే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. ఎంత ఏఐ టెక్నాలజీ ఉన్నా కూడా అత్యవసర పరిస్థితుల్లో పైలట్స్ గా ఉండే వాళ్ల జడ్జిమెంట్ ఎంతో కీలకం అని నిపుణులు చెపుతున్న మాట. సింగిల్ పైలట్ ఫ్లైట్స్ విధానం అమలు చేయటానికి ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టం లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. దీనికి దగ్గర దగ్గర 18000 కోట్ల రూపాయల వరకు అవసరం అవుతాయి అని అంచనా.