జనవరిలో 17 శాతం తగ్గిన విమాన ప్రయాణికులు
దేశీయ విమానయాన రంగం సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గత రెండేళ్లుగా కరోనా విడతల వారీగా విజృంభింటంతో ఎయిర్ లైన్స్ నానా కష్టాలు పడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కోవిడ్ ప్రభావం గణనీయంగా తగ్గటంతో విమాయాన కంపెనీలు భారీ ఆశలతో పరిశ్రమ రికవరీకి ఎదురుచూస్తున్నాయి. చాలా దేశాలు ఇప్పటికే ప్రయాణ ఆంక్షలు కూడా తొలగిస్తున్నాయి. మార్చి నుంచి ఈ రంగం తిరిగి గాడిన పడుతుందని భావిస్తున్నారు. అంతర్జాతీయ రూట్లలోనూ త్వరలోనే సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశం కన్పిస్తోంది. భారత్ మార్చి నెలాఖరు నుంచి రెగ్యులర్ వాణిజ్య అంతర్జాతీయ సర్వీసులకు అనుమతి ఇస్తుందా..లేక ముందే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్న అంశంపై ఆసక్తి నెలకొని ఉంది. ఇదిలా ఉంటే 2022 జనవరిలో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 17 శాతం మేర తగ్గింది.
ఈ జనవరిలో 64.08 లక్షల మంది మాత్రం ప్రయాణాలు సాగించారు. డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదలు చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించారు. జనవరి నెలలో ప్రముఖ చౌకధరల ఎయిర్ లైన్స్ స్పైస్ జెట్ ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) 73.4 శాతం ఉండగా..ఆ తర్వాత ఇండిగో 66.6 శాతం పీఎల్ఎఫ్ తో కార్యకలాపాలు నిర్వహించింది. 55.5 శాతం మార్కెట్ వాటాతో ఇండిగో అతి పెద్ద మార్కెట్ వాటాను దక్కించుకుంది. ఓ వైపు కరోనా దెబ్బపడగా..ఇప్పుడు రోజురోజుకూ పెరుగుతున్న విమానాల్లో ఉపయోగించే ఇంథనం ఏటీఎఫ్ ధరలు పెరగుతుండటం కూడా ఎయిర్ లైన్స్ కు చుక్కలు కన్పిస్తున్నాయి. ఏటీఎఫ్ ధరల కారణంగా త్వరలోనే ఎయిర్ లైన్స్ టిక్కెట్ల రేట్లను పెంచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.