టాటాల చేతికి ఎయిర్ ఇండియా..కేంద్రం ఖండన
ప్రభుత్వ రంగ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా ఇక టాటాల పరం కానుందని శుక్రవారం మధ్యాహ్నం నుంచి వార్తలు ఊపందుకున్నాయి. అన్ని ప్రధాన మీడియా సంస్థలు ఈ మేరకు కథనాలు ఇచ్చాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఇది జరిగిన కొన్ని గంటలకే కేంద్రం దీనిపై స్పందించింది. ఎయిరిండియా కొనుగోలులో టాటా సన్స్ విజేతగా నిలిచినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. దీనిపై తుది నిర్ణయం తీసుకున్న వెంటనే మీడియాకు తెలియజేస్తామని పేర్కొంది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డీఐపీఏఎం) కార్యదర్శి ట్వీట్ చేశారు.
ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్న వెంటనే మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయడానికి టాటా సన్స్ తుది బిడ్‌ను దక్కించుకుందని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి. స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ కూడా బిడ్ వేశారని, అయితే, ప్రభుత్వ కమిటీ నిర్ణయించిన కనీస ధరకంటే టాటాసన్స్ రూ. 3 వేల కోట్ల అధికంగా బిడ్ వేసినట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ తుది దశకు చేరినందున..ఇక అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయిగా ఉంది.