Telugu Gateway
Top Stories

ఎయిర్ ఇండియా బ‌రిలో టాటా స‌న్స్..స్పైస్ జెట్ ప్ర‌మోట‌ర్

ఎయిర్ ఇండియా బ‌రిలో టాటా స‌న్స్..స్పైస్ జెట్ ప్ర‌మోట‌ర్
X

ప్ర‌భుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా విక్ర‌యానికి సంబంధించి కీల‌క గడువు ముగిసింది. ఫైనాన్సియ‌ల్ బిడ్స్ స‌మ‌ర్ప‌ర‌ణ‌కు సెప్టెంబ‌ర్ 15వ తేదీనే చివ‌రి తేదీ. అయితే ఈ రేసులో ముందు నుంచి ఊహిస్తున్న‌ట్లు టాటా స‌న్స్ తోపాటు స్పైస్ జెట్ ప్ర‌మోట‌ర్ అజ‌య్ సింగ్ బ‌రిలో నిలిచారు. అయితే ఎయిర్ ఇండియా టాటా స‌న్స్ చేతికి వెళ్ళ‌టానికే ఎక్కువ ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం. ఫైనాన్సియ‌ల్ బిడ్స్ అన్నీ ప‌క్కాగా ఉంటే ఈ విక్ర‌య వ్య‌వ‌హ‌రం ఈ ఏడాది డిసెంబ‌ర్ నాటికి పూర్తి అవుతుంద‌ని అంచ‌నావేస్తున్నారు. కేంద్రం ఎయిర్ ఇండియాకు సంబంధించి వంద శాతం వాటా విక్ర‌యానికి రెడీ అయిన విష‌యం తెలిసిందే. ఎయిర్ ఇండియాతోపాటు దీని అనుబంధ సంస్థ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ లోనూ వంద శాతం, ఎయిర్ ఇండియా శాట్స్ ఎయిర్ పోర్ట్ స‌ర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో50 శాతం వాటాను విక్ర‌యించ‌నున్నారు.

అస‌లు ఎయిర్ ఇండియా వ్య‌వ‌స్థాప‌క సంస్థ టాటా స‌న్స్ కావ‌టం విశేషం. ఇప్పుడు బిడ్డింగ్ లో టాటా స‌న్స్ విజేత‌గా నిలిస్తే సంస్థ ప్రారంభించిన వారి చేతిలో తిరిగి వెళ్ళిన‌ట్లు అవుతుంది. ఎయిర్ ఇండియాకు చెందిన 23 వేల కోట్ల రూపాయ‌ల అప్పును విజేత‌గా నిలిచే సంస్థ‌కు బ‌ద‌లాయిస్తారు. మ‌రో 22 వేల కోట్ల రూపాయ‌ల అప్పును మాత్రం ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్స్ కు బ‌ద‌లాయిస్తారు. గ‌త కొన్నేళ్లుగా కేంద్రం ఎయిర్ ఇండియా విక్ర‌యానికి చ‌ర్య‌లు ప్రారంభించింది. కానీ ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఇది వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. 2018లో ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటాల విక్ర‌యానికి ప్ర‌య‌త్నించారు. కానీ అది ప‌లించ‌లేదు. ఇప్పుడు అందుకే వంద శాతం వాటాల విక్ర‌యానికి నిర్ణ‌యం తీసుకున్నారు.

Next Story
Share it