అమెరికాకు విమానాలు పునరుద్ధరించిన ఎయిర్ ఇండియా
ఎయిర్ ఇండియా అమెరికాకు తన విమాన సర్వీసులను పునరుద్ధరించింది. అమెరికాలో ప్రారంభం అయిన 5జీ సర్వీసుల వల్ల విమాన సేవలకు అంతరాయం ఏర్పడుతుందన్న భయంతో పలు అమెరికన్ ఎయిర్ లైన్స్ తమ సర్వీసులను నిలిపివేశాయి. ఇది పెద్ద సంచలనంగా మారింది. ఎయిర్ ఇండియా కూడా ఇదే ఆందోళనలతో తన సర్వీసులను ఆపింది. 5 జీ సర్వీసుల వల్ల బోయింగ్ 777 విమాన సర్వీసులకు ఎలాంటి ముప్పు లేదని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తాజాగా వెల్లడించటంతో ఈ సర్వీసులు ప్రారంభించటానికి రంగం సిద్ధం అయింది. దీంతో శుక్రవారం నుంచే అమెరికాకు వెళ్ళే తమ సర్వీసులు అన్నీ ప్రారంభం అయ్యాయని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. బోయింగ్ ఎయిర్ లైన్స్ కూడా ఈ సర్వీసులు ప్రారంభించేందుకు ఎలాంటి అవాంతరాలు లేవని ప్రకటించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు.
అమెరికాలో కొత్తగా ప్రారంభం అయిన 5జీ ఇంటర్నెట్ సేవల వల్ల విమానాల్లోని రేడియో అల్టీమీటర్లు ప్రభావితం అవుతాయని, దీని వల్ల విమానాల బ్రేకింగ్, ఇంజన్ లపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. అందుకే పలు ఎయిర్ లైన్స్ ఈ 5 జీ సర్వీసులపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయితే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) నూతన మార్గదర్శకాలు జారీ చేయటంతో పాటు 5జీ సర్వీసుల వల్ల ఎలాంటి ప్రభావం ఉండదని ప్రకటించటంతో ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం ప్రకటించింది. కొత్త ఆదేశాల అనంతరం లుఫ్తాన్స్, బ్రిటీష్ ఎయిర్ వేస్, జపాన్ ఎయిర్ వేస్, ఎమిరేట్స్ కూడా అమెరికాకు సర్వీసులు ప్రారంభించాయి.