Telugu Gateway
Top Stories

ఎయిర్ ఇండియా రికార్డు

ఎయిర్ ఇండియా రికార్డు
X

ఇండియాలో ఇప్పటి వరకు ఏ ఎయిర్ లైన్స్ దగ్గర కూడా ఏ 350 -900 మోడల్ విమానం లేదు. ఎయిర్ ఇండియా చేతికి తొలి ఏ 350 విమానం రావటంతో దేశంలోకి మొదటిసారి ఈ మోడల్ విమానం వచ్చినట్లు అయింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. 2024 మార్చి లోపు మరో ఐదు ఏ 350 విమానాలు ఎయిర్ ఇండియా ఫ్లీట్ లో చేరనున్నాయి. తొలి ఏ 350 విమానం తాజాగా ఢిల్లీ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కాగా..దీనికి ఘనంగా స్వాగతం పలికారు. ఫ్రాన్స్ కు చెందిన ఎయిర్ బస్ కు ఎయిర్ ఇండియా ఏకంగా 250 కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో ఏకంగా ఏ 350 విమానాలు 20 ఉన్నాయి. ఏ 350 -900 మోడల్ విమానంలో మొత్తం 316 సీట్లు ఉంటే... ఇందులో 264 ఎకానమీ క్లాస్ సీట్స్..మిగిలినవి బిజినెస్ క్లాస్, ప్రీమియం సీట్స్ కోసం కేటాయిస్తారు.

సుదూర ప్రాంతాల రూట్లలో ఈ ఏ 350 -900 విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ఎయిర్ ఇండియా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2024 జనవరి లో దీనికి సంబంధించింది షెడ్యూలు విడుదల కావొచ్చు అని చెప్పుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి టాటా గ్రూప్ చేతికి ఎయిర్ ఇండియా వచ్చిన దగ్గర నుంచి బ్రాండింగ్ తో పలు విషయాల్లో మార్పులు చేస్తూ ముందుకు సాగుతోంది. కొత్త లోగో తో పాటు సిబ్బంది డ్రెస్ లో కూడా మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియా చేతికి తొలి ఏ 350 -900 రాకపై సంస్థ సీఈఓ క్యాంప్ బెల్ విల్సన్ స్పందిస్తూ ప్రపంచ వేదికపై భారతీయ విమానయాన పునరుద్దరణకు ఇది ఒక తార్కాణం అని పేర్కొన్నారు.

Next Story
Share it