Telugu Gateway
Top Stories

ఎయిర్ ఇండియా ఏ 350 విమానాల ఫస్ట్ లుక్

ఎయిర్ ఇండియా ఏ 350 విమానాల ఫస్ట్ లుక్
X

టాటాల చేతికి వెళ్లిన దగ్గర నుంచి ఎయిర్ ఇండియా కొత్త రూపు సంతరించుకుంటోంది. అయితే ఇది ఒక నెల రెండు నెలల్లో జరిగే పని కాదు . దీర్ఘకాల ప్రణాళికలతో కొత్త యాజమాన్యం ఎయిర్ ఇండియా లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఇప్పుడు ఎయిర్ ఇండియా విమానాలు ఇక నుంచి ప్రయాణికులకు కొత్త లుక్ లో కనిపించబోతున్నాయి. కొత్త లోగో, డిజైన్ తో కూడిన ఏ 350 విమానాల ఫస్ట్ లుక్ ను ఎయిర్ ఇండియా ఎక్స్ లో షేర్ చేసింది. ఫ్రాన్స్ లోని టౌలోసి వర్క్ షాప్ లో కొత్త లోగో, డిజైన్ తో సిద్ధంగా ఉన్న ఈ విమానాలు ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. ఈ కొత్త లుక్ విమానాలు ఈ శీతాకాలంలోనే భారత్ కు రానున్నాయి. ఈ విమానాలను చూస్తే ఎయిర్ ఇండియా లోగో ఫాంట్ ను మార్చినట్లు కనిపిస్తోంది. ఎయిర్ ఇండియా ఫ్లీట్ లో ఉన్న అన్ని విమానాలు కొత్త లోగోలోకి మారనున్నాయి. దీనికోసం ఎయిర్ ఇండియా భారీ వ్యయమే చేయనుంది.

ఈ ఏడాది డిసెంబర్ నుంచి కొత్త లోగోతో ఎయిర్ ఇండియా సర్వీస్ లు ప్రారంభం కానున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే అన్ని విమానాలు కొత్త లోగో లోకి మారటానికి 2025 వరకు పట్టనుంది. విమానాల బయట లుక్ ఒక్కటే కాకుండా లోపల కూడా పెద్ద ఎత్తున మార్పులు చేయనున్నారు. మరో కీలక పరిణామం ఏమిటి అంటే ఎయిర్ ఇండియా లో విస్తార ఎయిర్ లైన్స్ విలీనం కూడా వచ్చే ఏడాది మార్చి నాటికీ పూర్తి అయ్యే అవకాశం ఉంది అని అంచనా. విమానయాన రంగం భవిష్యత్ ఆశాజనకంగా ఉంటుంది అనే అంచనాలు ఉండటంతో పెద్ద ఎత్తున కొత్త విమానాలకు ఆర్డర్లు ఇవ్వటంతో పాటు అంతర్గతంగా కూడా భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు.

Next Story
Share it