Telugu Gateway
Top Stories

భయపెట్టిన ఎయిర్ ఇండియా ఫ్లైట్

భయపెట్టిన ఎయిర్ ఇండియా ఫ్లైట్
X

హైదరాబాద్ నుంచి థాయిలాండ్ లోని ఫుకెట్ కు వెళ్లిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం ప్రయాణికులను భయపెట్టింది. దీనికి ప్రధాన కారణం ల్యాండింగ్ గేర్ లో సమస్యలు రావటంతో ఈ విమానం సాధారణ వేగం కంటే ఎక్కువ వేగంతో బలంగా రన్ వే ని తాకింది. దీంతో ఈ విమానంలో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ పరిణామం తో ఫుకెట్ ఎయిర్ పోర్ట్ రన్ వే తాత్కాలికంగా మూసివేశారు. ఈ మేరకు ఫుకెట్ ఎయిర్ పోర్ట్ అధికారులు ప్రకటన జారీ చేశారు. మార్చి 11 ఉదయం హైదరాబాద్ నుంచి ఫుకెట్ వెళ్లిన ఎయిర్ ఇండియా బోయింగ్ ఎక్స్ ప్రెస్ విమానం తీవ్ర సమస్య ఎదుర్కోవటం తో ల్యాండింగ్ సమయంలో విమానం ముందు టైర్ ఊడిపోయింది. ఈ విమానంలో ఏడుగురు సిబ్బంది, 131 మంది ప్రయాణీకులు ఉన్నారు.

ప్రయాణికులు అందరిని సురక్షితంగా కిందకు దించారు. ఈ విమానంలో ఉన్న ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదు అని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ వెల్లడించింది. విమానం ముందు భాగంలోని చక్రం(వీల్ )లో సమస్య వచ్చింది అని తెలిపారు. సిబ్బంది ప్రోటోకాల్ ప్రకారం అన్ని చర్యలు తీసుకుని ప్రయాణికులను సేఫ్ గా విమానం నుంచి దింపినట్లు అధికారికంగా ఒక ప్రకటనలో వెల్లడించింది. గత కొంత కాలంగా ఎయిర్ ఇండియా విమానాలు ఎన్నో సార్లు సాంకేతిక సమస్యలతో ప్రయాణికులను భయపెడుతున్నాయి. ఈ విషయాలను అంతా మరిచిపోతున్న తరుణంలో ఇప్పుడు ఫుకెట్ లో హార్డ్ ల్యాండింగ్ తో మరోసారి ఈ ఎయిర్ ఇండియా విమానాలు వార్తల్లో నిలిచాయి.

Next Story
Share it