పీఏసి ముందు ఎయిర్ ఇండియా

ప్రపంచ వ్యాప్తంగా వెయ్యికి పైగా డ్రీమ్ లైనర్ విమానాలు ప్రస్తుతం సేవలు అందిస్తున్నాయి. బోయింగ్ డ్రీమ్ లైనర్ 787 విమానాలు అత్యంత సురక్షితమైన విమానాల్లో ఒకటి అని ఎయిర్ ఇండియా వెల్లడించింది. మంగళవారం నాడు జరిగిన పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసి) సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవానికి పీఏసి సమావేశంలో ముఖ్యంగా విమానాశ్రయాల్లో వసూలు చేస్తున్న చార్జీలపై చర్చ జరగాల్సి ఉన్నా కూడా ...జూన్ 12 న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలడంతో ఇందులో ప్రయాణిస్తున్న 242 మంది ప్రయాణికుల్లో ఒక్కరు తప్ప 241 మంది ప్రయాణికులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత మరో సారి బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాల్లో భద్రత అంశం పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
అహ్మదాబాద్ ఘటన తర్వాత కూడా పలు చోట్ల బోయింగ్ విమానంలో సమస్యలు తలెత్తాయి. ఈ తరుణం లో ఎయిర్ ఇండియా ప్రతినిధులు అహ్మదాబాద్ ప్రమాద ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ .బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాలు సురక్షితం అయినవే అని చెప్పటం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పీఏసి సమావేశానికి ఎయిర్ ఇండియా సీఈఓ విల్సన్ కాంప్ బెల్ తో పాటు పౌర విమానయాన శాఖకు చెందిన ఉన్నతాధికారులు, డీజీసిఏ , ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారులు హాజరు అయ్యారు. అదే సమయంలో ఎయిర్ ఇండియా తో పాటు ఇండిగో, ఆకాశ ఎయిర్ లైన్స్ కు చెందిన ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు ముఖ్యంగా భద్రతాపరమైన చర్యల గురించి అధికారులను ప్రశ్నించారు. తక్షణమే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బిసిఏఎస్) ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
డీజిసిఏ పనితీరుపై కూడా ఎంపీలు పలు ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా ఇటీవల వెలుగులోకి వచ్చిన భద్రత వైఫల్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు. పెహల్గామ్ ఘటన తర్వాత విమాన టికెట్ రేట్లు అడ్డగోలుగా పెరగటం నియంత్రణ వైఫల్యానికి ఒక ఉదహరణ అన్నారు. ఇక బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాల భద్రత విషయానికి వస్తే మొత్తం మీద వీటికి సేఫ్టీ రికార్డు బాగానే ఉన్నా కూడా స్టార్టింగ్ లోనే అంటే ఈ విమానాల తయారీ కొత్తలోనే బ్యాటరీ సమస్యలు వెలుగులోకి వచ్చాయి. తర్వాత బోయింగ్ యాజమాన్యం ఈ విమానాల తయారీకి షార్ట్ కట్ విధానాలు అనుసరిస్తోంది అని విజిల్ బ్లోయర్ ఫిర్యాదు చేయటంతో వీటిపై పలు అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. కొన్ని సార్లు ఈ విమానాలు మార్గమధ్యంలో అకస్మాత్తుగా కిందకు దిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి అని చెపుతున్నారు. అయితే బోయింగ్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టి పారేస్తూ వస్తోంది. ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంతో మరో సారి ఈ విమానాల భద్రతపై చర్చ సాగుతోంది. అయితే ఈ విమానాలు ఉపయోగిస్తున్న ఎయిర్ లైన్స్ వీటి విషయంలో ఇప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.



