కుక్క పిల్ల కోసం ఎయిర్ ఇండియా విమానంలో 12 బిజినెస్ క్లాస్ సీట్లు
డబ్బు ఉంటే ఏదైనా చేయోచ్చు అనటానికి ఇదో ఉదాహరణ. దేశంలో అసలు విమానం మొహం చూడని వారే కోట్ల మంది ఉంటారు. ఎకానమీ క్లాస్ లో అయినా సరే టిక్కెట్ కొనుక్కుని ఒక్కసారి విమానం ఎక్కితే చాలు అనుకునే వారి సంఖ్య కూడా కోట్లలోనే ఉంటుంది. కానీ అందుకు కావాల్సింది డబ్బు. అయితే ఓ డబ్బున్న వ్యక్తి అత్యంత ఖరీదైన బిజినెస్ క్లాస్ టిక్కెట్లను కుక్క కోసం కొనుగోలు చేశారు. అందులో ఒకటి అరా కాదు..ఏకంగా కుక్క కోసం పన్నెండు టిక్కెట్లు బుక్ చేశారు. ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్ టిక్కెట్లు అంటే చాలా కాస్ట్లీ. ఒక్క ఎయిర్ ఇండియానే కాదు..ఏ ఎయిర్ లైన్స్ లో అయినా బిజినెస్ క్లాస్ అంటే ఎక్కువ ధర చెల్లించాల్సిందే. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే కుక్క కోసం ఆ సంపన్నుడు 2.50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. తాజాగా ముంబయ్ నుంచి చెన్నయ్ వెళ్ళే విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఎయిర్ ఇండియ విమానం ఏఐ-671లో ఈ కుక్క అత్యంత విలాసవంతంగా ఈ కుక్క పిల్ల పర్యటించినట్లు అయింది. ప్రయాణికుల క్యాబిన్లలో పెంపుడు కుక్కలను తీసుకెళ్లేందుకు దేశంలో అనుమతించేది ఒక్క ఎయిర్ ఇండియా మాత్రమే. అయితే ఒక విమానంలో రెండు పెంపు కుక్కలను మాత్రమే అనుమతిస్తారు. అంతే కాకుండా బుక్ చేసిన టిక్కెట్ల విభాగంలో చివరి సీట్లలో మాత్రమే వీటికి అనుమతిస్తారు. గతంలో ఇలా చాలాసార్లు పెంపుడు కుక్కలను తీసుకెళ్ళినా కూడా ఒక్క కుక్క పిల్ల కోసం బిజినెస్ క్లాస్ లో ఉన్న టిక్కెట్లు అన్నీ కొనుగోలు చేయటం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.