ప్రపంచంలోనే ఎత్తైన అబ్జర్వేషన్ వీల్..దుబాయ్ మరో ప్రపంచ రికార్డు
దుబాయ్ పేరిట ప్రపంచ రికార్డులు చాలానే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా..అతి పెద్ద వాటర్ ఫౌంటేన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా అలా పోతూ ఉంటుంది. ఇప్పుడు అందులో మరొక అద్భుతం వచ్చి చేరింది. ఇది ప్రపంచ పర్యాటకులకు ఓ అద్భుతమైన అనుభూతిని ఇది కల్పించనుంది. ఎయిన్ దుబాయ్ పేరుతో పిలిచే ఈ అబ్జర్వేషన్ వీల్ ఎక్కి దుబాయ్ అందాలను చూడొచ్చు. ఎయిన్ దుబాయ్ (Ain dubai) పర్యాటకులకు అక్టోబర్ 21 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ అబ్జర్వేషన్ వీల్ ద్వారా 19 రకాల కస్టమైజ్డ్ సేవలు అందుబాటులో ఉండబోతున్నాయి. 250 మీటర్ల ఎత్తులో ఉండే ఈ అబ్జర్వేషన్ వీల్ పర్యాటక ఆకర్షణల్లో మరొక కీలక ప్రదేశంగా మారనుంది. దుబాయ్ దీర్ఘకాలిక వ్యూహాలకు ఇది ఓ నిదర్శనం గా నిర్వాహకులు అభివర్ణిస్తున్నారు. ఎయిన్ దుబాయ్ ప్రత్యేక కార్యక్రమాల కోసం విలాసమైంతమైన క్యాబిన్లు, నైట్ లైఫ్ అండ్ పార్టీలు, యువత నిర్వహించే రొమాంటిక్ ప్రత్యేక కార్యక్రమాలు, ఫ్యామిలీ, ఫ్రెండ్లీ క్యాబిన్స్ ఇందులో ఉంటాయని ఎయిన్ దుబాయ్ జనరల్ మేనేజర్ రొనాల్డ్ డ్రాకే వెల్లడించారు. అంతిమంగా ఇది ఓ ఉత్సవాల కేంద్రంగా ఉంటుందని తెలిపారు. కార్పొరేట్ల ప్రత్యేక అవసరాలు తీర్చటంతోపాటు ఆకాశంలో విందు వంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉంటాయి.
పగలు, రాత్రి కూడా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఎయిన్ దుబాయ్ ద్వారా పర్యాటకులు సూర్యాస్తమయ సుందర దృశ్యాలను చూడొచ్చు. ఈ అబ్జర్వేషన్ వీల్ ఒక రొటేషన్ సమయం 38 నిమిషాలు..రెండు రొటేషన్లు కలిపి 78 నిమిషాల వరకూ ఉంటుందని తెలిపారు. అబ్జర్వేషన్ క్యాబిన్లలో గతంలో ఎన్నడూలేని రీతిలో దుబాయ్ ను 360 డిగ్రీల కోణంలో చూడొచ్చన్నారు. దీని ద్వారా జీవితకాలం గుర్తుండిపోయేలా మ్యాజికల్ పోటో బుక్ సిద్ధం చేసుకోవచ్చన్నారు. ఎయిన్ దుబాయ్ లో స్కైబార్ క్యాబిన్స్ కూడా ఉంటాయి. అంతే కాదు..విఐపిలు ప్రత్యేకంగా ఉండేందుకు ప్రైవేట్ క్యాబిన్లు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ఎయిన్ దుబాయ్ టిక్కెట్ల ప్రారంభం ధర 130 అరబ్ ఎమిరేట్స్ దిర్హమ్ (ఏఈడీ)గా ప్రారంభం అవుతాయి.