Telugu Gateway
Top Stories

ప్రభుత్వ నిర్ణయాన్ని ఆటోమొబైల్ కంపెనీలు కాదంటాయా!

ప్రభుత్వ నిర్ణయాన్ని ఆటోమొబైల్ కంపెనీలు కాదంటాయా!
X

కేంద్రం గత కొంత కాలంగా ఇంధన బిల్లు తగ్గించుకోవటంపై ఫోకస్ పెట్టింది. ఇందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తోంది. దేశం తన ఇంధన అవసరాలకు ఎక్కువ శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఎక్కువ మొత్తం విదేశీ మారక నిల్వలను ఈ దిగుమతుల కోసం ఖర్చుపెట్ట్టాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ ఖర్చును తగ్గించుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను వెతుకుతోంది. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఒక వైపు ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఈ కంపెనీలకు పలు రాయితీలు ఇస్తూ వీటిని వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చూస్తోంది. మరో వైపు కేంద్ర ప్రభుత్వం గత కొంత కాలంగా E20 పెట్రోల్ ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నా కూడా కేంద్రం మాత్రం వీటిని తోసిపుచ్చుతోంది. మరో వైపు ఆటోమొబైల్ రంగ నిపుణులు మాత్రం ఇప్పటికిప్పుడు E20 పెట్రోల్ వాడటం వల్ల వాహనాలకు ఎలాంటి సమస్యలు రావు అని చెపుతున్నారు. అదే సమయంలో పాత వాహనాల కు మాత్రం ఈ ఇంధనం వాడటం వల్ల సమస్యలు రావొచ్చు అనే అనుమానాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే కేంద్రం మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున E20 పెట్రోల్ ను ప్రోత్సహిస్తూ ముందుకు వెళుతోంది.

ఇథనాల్ కలవని పెట్రోల్ అన్ని బంకుల్లో కూడా దొరకటం లేదు. దీంతో వినియోగదారులకు E20 పెట్రోల్ పోయించుకోవటం తప్ప మరో మార్గం లేకుండా పోతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా E20 పెట్రోల్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వాహనదారుల్లో మాత్రం E20 పెట్రోల్ వాడటం వల్ల మైలేజ్ తగ్గటంతో ఇంజిన్ దెబ్బతినే అవకాశం ఉంది అనే అనుమానాలు పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్నాయి. దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు అన్నీ కూడా ఈ విషయంలో ఫలితం ఎలా ఉన్నా కూడా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితిలో ఉండవు అనే విషయం తెలిసిందే. E20 పెట్రోల్ అంటే సాధారణ పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్, 80 శాతం ముడి పెట్రోల్‌ను కలిపి తయారు చేసిన ఇంధనం. కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి భారత ప్రభుత్వం దీనిని దశలవారీగా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు E20 పెట్రోల్ విషయంలోనే ఆందోళనలు వ్యక్తం అవుతుంటే కేంద్రం ఇప్పుడు డీజిల్ విషయంలో కూడా ఇదే తరహా విధానాన్ని అమలు చేయటానికి రంగం సిద్ధం చేస్తోంది.

తాజాగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దీనిపై ఒక ప్రకటన చేశారు. పెట్రోల్‌లో ఇథనాల్‌ కలిపినట్టుగా డీజిల్‌లో ఐసోబ్యూటనాల్‌ను కలిపి విక్రయించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇథనాల్‌ను పెట్రోల్‌లో నేరుగా కలపవచ్చు. కానీ డీజిల్‌లో కలపడానికి వీలుండదు. దీనితో ఇథనాల్‌ను ఐసోబ్యూటనాల్‌గా మార్చి డీజిల్‌లో కలుపుతారు. డీజిల్‌లో 15శాతం ఐసోబ్యూటనాల్‌ను కలపాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీనిపై ప్రయోగాత్మక పరిశీలన ఇప్పటికే పూర్తయిందని, మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. వంద శాతం ఇథనాల్‌, ఐసోబ్యూటనాల్‌తో రెండు జనరేటర్లను విజయవంతంగా నడిపామని, ఈ ఇంధనాలతో నడిచే ఇంజన్లను రూపొందించడం సాధ్యమని దీనితో స్పష్టమైందని వెల్లడించారు. ఇప్పటికే డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా బయోడీజిల్‌ వంటి పలు జీవ ఇంధనాలను అభివృద్ధి చేశారు. వాటితో పోలిస్తే ఐసోబ్యూటనాల్‌ ఉత్పత్తికి తక్కువ ఖర్చు అవుతుందని, ఇది విడుదల చేసే శక్తి ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాదు ఇప్పటికే ఉన్న డీజిల్‌ ఇంజన్లలో వాడేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. మొక్కజొన్న, బియ్యం, చెరుకు వంటివాటి నుంచి ఇథనాల్‌ను తయారు చేసిన విధానంలోనే ఐసోబ్యూటనాల్‌ను తయారు చేస్తారు. ఇథనాల్‌ నుంచి కూడా పలు రసాయన ప్రక్రియల ద్వారా ఐసోబ్యూటనాల్‌ను తయారు చేస్తారు. పెట్రోల్‌, ఇథనాల్‌ వంటివాటితో పోలిస్తే దీనికి మండే గుణం తక్కువ. కానీ ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది. ఇథనాల్‌ తరహాలోనే ఐసోబ్యూటనాల్‌ తయారీ కోసం లీటరుకు సుమారు రూ.55 నుంచి రూ.80 వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. తాజాగా చోటుచేసుకోనున్న ఈ మార్పులు పెద్ద ఎత్తున చర్చకు కారణం కాబోతున్నాయి. మరో వైపు ఈ మార్పుల విషయంలో ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రధానంగా ఈ విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫ్యామిలీ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అయితే వీటిని మంత్రి ఖండిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ విషయంలో చోటుచేసుకుంటున్న మార్పులు వాహనదారులను గందరగోళంలోకి నెడుతున్నాయి అనే చెప్పాలి.

Next Story
Share it