Telugu Gateway
Top Stories

అదర్ పూనావాలా అదిరిపోయే డీల్

అదర్ పూనావాలా అదిరిపోయే డీల్
X

ఎవరైనా వంద కోట్లు పెట్టి ఇళ్ళు కొంటే వామ్మో అంటాం. ఐదు వందల కోట్లు పెడితే అవాక్కు అవుతాం. కానీ అయన మాత్రం ఏకంగా 1445 కోట్ల రూపాయలు పెట్టి ఒక మాన్షన్ కొనుగోలు చేశాడు. కరోనా రాక ముందు అయన పేరు, అయన కంపెనీ పేరు దేశంలో పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ కరోనా కారణంగా అయన దేశంలోని ప్రతి ఒక్కరికి తెలియటమే కాకుండా...అయన కంపెనీ కూడా ఫుల్ పాపులర్ అయింది. కరోనా ప్రపంచాన్ని వణికిస్తే కొంత మంది పారిశ్రామికవేత్తలకు మాత్రం కాసులు కురిపించింది. ముఖ్యంగా వాక్సిన్ తయారీ కంపెనీల అధిపతులకు. భారత్ లో ఇలా వాక్సిన్ తయారీ ద్వారా వేల కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించిన కంపెనీల్లో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఒకటి. ఈ కంపెనీ కరోనా సమయంలో కోవిషీల్డ్ పేరుతో వాక్సిన్ సరఫరా చేసిన విషయం తెలిసిందే.

ఇది అంతా ఇప్పుడు ఎందుకు అంటే సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా లండన్ లో ఏకంగా 1445 కోట్ల రూపాయలు పెట్టి అత్యంత విలాసవంతమైన ఒక బిల్డింగ్ ను చేజిక్కుంచుకున్నారు. లండన్ లోని కీలక ప్రాంతంలో 25 వేల చదరపు అడుగుల్లో ఈ భవనం విస్తరించి ఉంటుంది. ఈ మే ఫెయిర్ భవనాన్ని అదర్ పూనావాలా కొనుగోలు చేశారు. ఇది లండన్ లో జరిగిన రెండవ అతి పెద్ద డీల్ గా చెపుతున్నారు. కంపెనీ అవసరాలతో పాటు వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకునేలా ఈ భవనాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. 1920 సంవత్సరాల నాటి ఈ బిల్డింగ్ ను సీరం లండన్ అనుబంధ సంస్థ అయిన సీరం లైఫ్ సైన్సెస్ పేరుతో కొనుగోలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దేశంలోనే అతి పెద్ద వాక్సిన్ తయారీ కంపెనీగా సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉంది.

Next Story
Share it