అదానీ ‘టోటల్ గ్యాస్ ’ !
అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీ ల్లో ‘అదానీ ‘టోటల్ గ్యాస్ లిమిటెడ్ ’ కూడా ఒకటి. ఈ కంపెనీ పని తీరు ఎలా ఉంది అంటే పేరుకు తగ్గట్లే అంతా గ్యాస్ అన్న చందంగా తయారు అయింది. ఎందుకంటే అదానీ గ్రూప్ మోసాలకు సంబంధించి అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఈ షేర్ పరిస్థితి మరీ దారుణంగా తయారు అయింది. గ్రూప్ కంపెనీ షేర్లు అన్నీ కుప్పకూలినా కూడా ‘అదానీ ‘టోటల్ గ్యాస్ ’ లిమిటెడ్ షేర్ అయితే ఏకంగా 80 శాతం పైగా నష్ట పోయింది. ఈ షేర్ 52 వారాల గరిష్ట ధర 3998 రూపాయలు అయితే ఈ శుక్రవారం నాడు అంటే ఫిబ్రవరి 24 న 753 రూపాయల కనిష్ట స్థాయికి పతనం అయింది. 52 వారాల గరిష్ట స్థాయి లెక్క ప్రకారం చూస్తే ఒక్కో షేర్ పై మదుపరులు 3245 రూపాయలు నష్టపోయినట్లు లెక్క. వంద షేర్లు ఉంటేనే ఈ నష్టం మూడు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు కావటం విశేషం. స్కాం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈ కంపెనీ అసలు ప్రతి రోజు లోయర్ సీలింగ్ తాకుతూనే ఉంది. అలాంటిదే అదానీ గ్రూప్ లో మరో కంపెనీ కూడా ఉంది. అదానీ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్. దీని పరిస్థితి కూడా అదానీ టోటల్ గ్యాస్ తరహానే. ఈ షేర్ 52 వారాల గరిష్ట స్థాయి 4238 రూపాయలు అయితే..ఈ శుక్రవారం నాడు మరో ఐదు శాతం నష్టం తో 712 రూపాయల కనిష్ట స్థాయికి పడిపోయింది.
ఈ లెక్కన అదానీ ట్రాన్స్ మిషన్ షేర్ ఒక్కో దానిపై ఇన్వెస్టర్ లకు 3526 రూపాయల మేర నష్టం వచ్చింది. వంద షేర్లకే ఈ నష్టం మూడున్నర లక్షల రూపాయలు ఉంది. మొత్తం అదానీ గ్రూప్ పరంగా చూసుకుంటే ఒక నెల రోజుల వ్యవధిలోనే అన్ని కంపెనీలకు కలిపి వాటిల్లిన నష్టం సుమారు 12 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక వచ్చాక అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కొన్ని మధ్యలో పెరిగాయి..మళ్ళీ తగ్గాయి కానీ...అదానీ టోటల్ గ్యాస్. అదానీ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్ షేర్లు మాత్రం నేల చూపులే తప్ప అసలు పెరగటం అన్నదే లేదు. ఒక దాని తర్వాత అదానీ గ్రూప్ పై వస్తున్న వార్తలతో ఈ పతనం ఎప్పటికి ఆగుతుంది అన్న అంశంపై ఎవరికీ క్లారిటీ లేదు. అదే సమయంలో సుప్రీం కోర్ట్ ఆదేశాలు , సెబీ చర్యలు ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు అత్యంత కీలకం కానుంది. అదానీ స్కాం ప్రకంపనలు రాబోయే రోజుల్లో కూడా కొనసాగే అవకాశం ఉందని అంచనాలు మార్కెట్ వర్గాల్లో ఉన్నాయి.