Telugu Gateway
Top Stories

అదానీ ఆడిటింగ్ కామెడీ !

అదానీ ఆడిటింగ్ కామెడీ !
X

తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే ఒక కంపెనీని ఎంపిక చేసుకుంటారు. ఆ సంస్థ తో స్వతంత్ర ఆడిటింగ్ చేయించుకుని సర్టిఫికెట్ తీసుకుంటారట. దాన్ని అందరికీ చూపించి అసలు మా కంపెనీల్లో ఏమి జరగలేదు అంతా పక్కాగా ఉంది అని చెప్పుకుంటారు. అదానీ గ్రూప్ వ్యవహారం చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ఎందుకు అంటే అదానీ గ్రూప్ తమపై అమెరికా కు చెందిన సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల అంశంపై..ఎంపిక చేసిన గ్రూప్ కంపెనీల్లో స్వతంత్ర ఆడిటింగ్ కోసం అమెరికాకు చెందిన గ్రాంట్ ఢోర్టన్ ను ఎంపిక చేసుకుంది. ఈ సంస్థ ఆడిట్ చేసిన తర్వాత నియంత్రణా సంస్థలు, పెట్టుబడిదారులకు నమ్మకం కల్పించాలనేది అదానీ గ్రూప్ ప్లాన్ గా చెపుతున్నారు. హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ దెబ్బకు అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా 120 బిలియన్ డాలర్లు నష్టపోయినట్లు లెక్కలు చెపుతున్నాయి. దీనిపై స్పందించాల్సిన కేంద్రం, ఆర్థిక శాఖ కేవలం నియంత్రణ సంస్థలు చూసుకుంటాయే అనే మాట తప్ప ఏమి మాట్లాడం లేదు.

మరో కీలక విషయం ఏమిటి అంటే సుప్రీం కోర్ట్ కేసు సందర్భంగా కూడా భవిష్యత్ లో ఇన్వెస్టర్లు నష్టపోకుండా చేపట్టాల్సిన చర్యలపై కమిటీ అంటున్నారు తప్ప..అసలు హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికలో చెప్పిన విషయాలు వాస్తవమా కాదా అన్నది తేల్చటానికి అని ఎక్కడ స్పష్టంగా చెప్పటం లేదు. దేశంలోని పార్టీలు అన్ని ఏకమై అదానీ అంశంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేసినా మోడీ సర్కార్ డోంట్ కేర్ అంటూ అసలు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ మొత్తం ఎపిసోడ్ లో అత్యంత కీలమైన విషయం ఏమిటి అంటే అదానీ గ్రూప్ ఇప్పుడు ఎంపిక చేసుకున్న గ్రాంట్ ఢోర్టన్ పై కూడా పలు అభియోగాలు ఉన్నాయి. అవి ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. గ్రాంట్ ఢోర్టన్ ఆడిటింగ్ విషయంలో చేసిన ఘోరమైన తప్పిదాలకు గాను పలు మార్లు జరిమానాలు చవిచూసింది. మరి ఇలాంటి సంస్థ తో ఇండిపెండెంట్ ఆడిటింగ్ చేయించి అదానీ గ్రూప్ ఇన్వెస్టర్లకు...ప్రజలకు ఏమి విశ్వాసం కల్పించగలుగుతుంది. అదానీ ఎపిసోడ్ చూస్తుంటే తప్పు చేసిన వాళ్లే సెల్ఫ్ సర్టిఫికేషన్ కోసం సొంతంగా కంపెనీని ఎంపిక చేసుకున్నట్లు ఉంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it