సగం భారతీయ సంస్థల నుంచే

దేశంలో అతి వేగంగా ఎదిగిన పారిశ్రామిక సంస్థల్లో అదానీ గ్రూప్ మొదటి స్థానంలో ఉంటుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ గ్రూప్ పై వచ్చిన ఆరోపణలు కూడా అన్ని ఇన్ని కావు. అయితే ఎప్పటికప్పుడు ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ అదానీ గ్రూప్ మాత్రం ఎంతో వేగంగా పలు రంగాల్లోకి విస్తరిస్తూ ముందుకు సాగుతోంది. ఓడరేవులు, ఎయిర్ పోర్ట్స్, పవర్, సిమెంట్, డేటా సెంటర్స్, రహదారులు, మీడియా ఇలా ఎన్నో రంగాల్లో అదానీ గ్రూప్ విస్తరించిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ అప్పులకు సంబంధించి ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్ అఫ్ ఇండియా సోమవారం నాడు ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. అదేంటి అంటే అదానీ గ్రూప్ సమీకరిస్తున్న మొత్తం అప్పుల్లో సగం మేరకు దేశంలోని బ్యాంకు లు, ఎన్ బీఎఫ్ సి లు..ఇతర ఆర్థిక సంస్థలు సమకూరుస్తున్నాయి. మరో వైపు అదానీ గ్రూప్ విదేశీ బ్యాంకు లు..ఇతర విదేశీ సంస్థల నుంచి డాలర్ లోన్స్ తగ్గుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే దేశీయ రుణాల్లో ఎక్కువ మొత్తం అదానీ గ్రూప్ కంపెనీ లకు ప్రభుత్వ రంగ బ్యాంకు లే సమకూర్చుతుండటం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నాటికి అంటే 2025 జూన్ తో ముగిసిన మూడు నెలల కాలానికి ప్రభుత్వ రంగ బ్యాంకు లు అదానీ గ్రూప్ కంపెనీలకు అందించిన రుణాలు మొత్తం 47829 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ రుణాల మొత్తం 13 శాతం ఉంటే...ఇప్పుడు అది 18 శాతానికి పెరిగింది. ప్రైవేట్ బ్యాంకు లు మాత్రం ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ బ్యాంకు ల వాటా ఏ మాత్రం మార్పులేకుండా కేవలం రెండు శాతం మాత్రమే ఉంది. 2025 జూన్ తో ముగిసిన మూడు నెలల కాలానికి ప్రైవేట్ బ్యాంకు లు ఈ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాలు 5314 కోట్ల రూపాయలు. ప్రభుత్వ రంగ బ్యాంకు ల తర్వాత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలు( ఎన్ బీఎఫ్ సి)లు, ఇతర ఆర్థిక సంస్థల వాటా కూడా గణనీయంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వీటి రుణాల మొత్తం 42099 కోట్ల రూపాయల నుంచి 66429 కోట్ల రూపాయలకు పెరిగాయి. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల రుణాలు ఇదే కాలంలో 13295 కోట్ల రూపాయల నుంచి 13286 కోట్ల రూపాయలకు తగ్గాయి.
కేవలం రెండు సంవత్సరాల్లోనే దేశీయ బ్యాంకు లు దగ్గర దగ్గర అదానీ గ్రూప్ కంపెనీలకు 1.3 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చి గ్రూప్ ఫైనాన్స్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించాయి. విద్యుత్ రంగంతో పాటు ఓడరేవుల్లో దీర్ఘకాలిక ప్రాజెక్ట్ లు దక్కించుకోవటం ద్వారా నగదు ప్రవాహం నిలకడగా ఉండేలా చేసుకుంటున్నట్లు కంపెనీ ఇన్వెస్టర్లకు ఇచ్చిన ప్రెజంటేషన్ లో వెల్లడించింది. ప్రస్తుతం గ్రూప్ దగ్గర 60000 వేల కోట్ల రూపాయల నగదు నిల్వలు ఉన్నాయి. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) గత కొంత కాలంగా వడ్డీ రేట్లు తగ్గిస్తూ వస్తుండటంతో తక్కువ వడ్డీ కే రుణాలు సేకరించిన కారణంగా క్రెడిట్ రేటింగ్స్ కూడా మెరుగు అయ్యాయి. ఒకప్పుడు ఈ రుణాల్లో డాలర్ బాండ్స్ వాటా 31 శాతం ఉండగా..ఇప్పుడు అది 23 శాతానికి పడిపోయింది. విదేశీ బ్యాంకు ల నుంచి తీసుకునే డాలర్ రుణాలు కూడా 28 శాతం నుంచి 27 శాతానికి తగ్గాయి.
కొద్ది నెలల క్రితం అమెరికా అధికారులు గౌతమ్ అదానీ తో పాటు ఆయన కంపెనీ ప్రతినిధులపై అవినీతి విషయంలో అభియోగాలు మోపటంతో దేశీయ బ్యాంకు లు అదానీ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాల విషయంలో సమీక్ష చేయటంతో పాటు రాబోయే రోజుల్లో రుణాల మంజూరు విషయంలో మరింత కఠిన నిబంధలను అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా కేసు ఏ మాత్రం ముందుకు సాగటం లేదు. మరో వైపు పీఎస్ యూ బ్యాంకు లతో పాటు ఇతర ఆర్థిక సంస్థలు కూడా అదానీ గ్రూప్ కంపెనీలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేస్తున్నాయి. అయితే గత ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూప్ కంపెనీ మంచి ఫలితాలనే ప్రకటించటం కూడా కలిసివచ్చింది.



