Telugu Gateway
Top Stories

అదానీ గ్రూపు అప్పు 2.20 లక్షల కోట్లు!

అదానీ గ్రూపు  అప్పు 2.20 లక్షల కోట్లు!
X

గౌత‌మ్ అదానీ. ఇప్పుడు దేశంలో మారుమోగుతున్న పేరు. వ్యాపారం ఏదైనా అందులో అదానీ గ్రూప్ ఉండాల్సిందే. అన‌తికాలంలోనే విమానాశ్ర‌యాల నిర్వ‌హ‌ణ రంగంలోకి ప్ర‌వేశించి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ముంబ‌య్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంతో పాటు ఏఏఐ ఆధీనంలోని ప‌లు కీల‌క విమానాశ్ర‌యాల‌ను దక్కించుకుంది. తాజాగా ప్ర‌ముఖ సిమెంట్ కంపెనీలు గుజ‌రాత్ అంబుజాతోపాటు ఏసీసీలో కూడా వాటాలు కొన‌టం ద్వారా సంచ‌ల‌నాలు న‌మోదు చేసింది. అత్యంత కీల‌క‌మైన అన్ని రంగాల్లోనూ ఇప్పుడు అదానీ గ్రూపు హ‌వా న‌డుస్తోంది. అదానీ గ్రూపున‌కు చెందిన ప‌లు లిస్టెడ్ కంపెనీలు ఇన్వెస్ట‌ర్ల‌కు మంచి లాభాలు ఇస్తున్నాయి. అయితే తాజాగా అదానీ గ్రూపున‌కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర అంశం వెలుగుచూసింది. అది ఏమిటి అంటే అదానీ గ్రూపు స్థూల అప్పులు 2.20 లక్షల కోట్లు అని ప్ర‌ముఖ ఆంగ్ల దిన‌ప‌త్రిక బిజినెస్ స్టాండ‌ర్డ్ ఓ క‌ధ‌నం ప్ర‌చురించింది.

2022 మార్చి చివ‌రి నాటికి ఈ అప్పులు ఉన్న‌ట్లు తెలిపారు. దీంతో దేశంలోనే భారీ అప్పులు ఉన్న కార్పొరేట్ సంస్థ‌గా ఇది అవ‌త‌రించింది. ఏడాది కాలంలోనే అదానీ గ్రూపు అప్పులు ఏకంగా 42 శాతం మేర పెరిగిన‌ట్లు తేల్చారు. అయితే ఇంత భారీ స్థాయిలో అప్పులు ఉన్నా కూడా అదానీ గ్రూపు అప్పుల చెల్లింపు సామ‌ర్ధ్యం మెరుగ్గానే ఉంద‌ని విశ్లేష‌కులు చెప్పిన‌ట్లు ఈ నివేదిక వెల్ల‌డించింది. అయితే ఆయా కంపెనీల ఆదాయం పెర‌గ‌టం, క‌రోనా కార‌ణంగా రెండేళ్ల పాటు వ‌డ్డీ రేట్లు త‌క్కువ‌గా ఉండ‌టం కూడా అదానీ గ్రూపున‌కు క‌లిసొచ్చిన అంశంగా ఈ నివేదిక వెల్ల‌డించిది. అయితే ఇప్పుడు దేశంలో ద్ర‌వ్యోల్భ‌ణం భారీగా పెరుగుతుండ‌టంతో పాటు..అనేక ఆర్ధిక స‌మ‌స్య‌లు కార‌ణంగా రాబోయే రోజుల్లో వ‌డ్డీ రేట్లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నాలు వెలువడుతున్నాయి. వ‌డ్డీ రేట్లు మ‌రింత పెరిగితేమాత్రం ఆ ప్ర‌భావం ఖ‌చ్చితంగా అదానీ గ్రూపుపై ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. వ్యాపార కార్య‌క‌లాపాల విస్త‌ర‌ణ‌కు అదానీ గ్రూపు భారీ ఎత్తున రుణాలు సేక‌రిస్తోంది.

Next Story
Share it