కుప్పకూలిన అదానీ గ్రూప్ షేర్లు
అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు అన్నీ సోమవారం నాడు కుప్పకూలాయి. దీనికి ప్రధాన కారణం అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ ఆడిటర్ బాధ్యతల నుంచి డెలాయిట్ తప్పుకోవటమే. హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ లో వెల్లడించిన కొన్ని అంశాలపై కంపెనీ క్లారిటీ ఇవ్వకపోవటంతో డెలాయిట్ అర్దాంతరంగా గుడ్ బై చెప్పింది. ఈ ప్రభావంతో మార్కెట్ లో ఒక్క రోజులోనే ఒక దశలో అదానీ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ నలభై వేల కోర్టుల రూపాయల మేర పతనం అయింది. అదానీ గ్రూప్ లోని కీలక కంపెనీ అయిన అదానీ ఎంటర్ ప్రెజెస్ షేర్ ధర 83 రూపాయల నష్టంతో 2455 రూపాయల వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్ షేర్ ధర 13 రూపాయల నష్టంతో 787 రూపాయల వద్ద క్లోజ్ అయింది. ఇలా అదానీ గ్రూప్ లోని అన్నీ లిస్టెడ్ కంపెనీలు నష్టాల బాటలోనే సాగాయి. రాబోయే రోజుల్లో కూడా అదానీ గ్రూప్ పై ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే సుప్రీం కోర్ట్ కు హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ లో అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణలపై తన తుది నివేదింకా సమర్పించాల్సిన మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మరో పదిహేను రోజులు గడువుకోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అదానీ పోర్ట్స్ కొత్త ఆడిటర్ గా ఎంఎస్ కెఏ అసోసియేట్స్ అదానీ పోర్ట్స్ నియమించుకుంది. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం మాత్రం ఇప్పటివరకు ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. అదే అదానీ కాకుండా వేరే కంపెనీ విషయంలో అయితే ప్రభుత్వంలోని కీలక శాఖలు రంగంలోకి దిగేవి. ఇది అదానీ వ్యవహారం కావటంతో అంతా సైలెంట్ గా ఉండిపోయారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.