Telugu Gateway
Top Stories

డీల్ ఓకే అయితే..అదానీ ఇంటర్నేషనల్ ఎంట్రీ

డీల్ ఓకే అయితే..అదానీ ఇంటర్నేషనల్ ఎంట్రీ
X

భారత ప్రధాని నరేంద్ర మోడీ శ్రీలంక లో అదానీ గ్రూప్ కు ఒక విద్యుత్ ప్రాజెక్ట్ ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేసినట్లు శ్రీలంక కు చెందిన సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు(సిఈబి) చైర్మన్ ఫెర్డినాండో గతంలో సంచలన ఆరోపణలు చేశారు. అది కూడా ఆ దేశ పార్లమెంటరీ ప్యానెల్ ముందు చెప్పారు. ఈ ప్రకటన చేసిన మరునాడే అయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పటి శ్రీలంక ప్రెసిడెంట్ గోటబాయ రాజపక్సే పై ప్రధాని మోడీ ఒత్తిడి తెచ్చి అదానీకి ప్రాజెక్ట్ ఇప్పించినట్లు అయన చేసిన ఆరోపణలు భారత్ లో కూడా పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ప్రధాని మోడీ ఎప్పుడూ..ఎక్కడా నోరు తెరిచి మాట్లాడిన దాఖలాలు లేవు. అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణల విషయంలో కూడా మోడీ ఇదే మోడల్ ను ఫాలో అయ్యారు. ఇవన్నీ పాత విషయాలు అయితే ఇప్పుడు మరో బిగ్ డీల్ చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అదేంటి అంటే అదానీ గ్రూప్ కు శ్రీలంక లోని మూడు కీలక విమానాశ్రయాల నిర్వహణ బాధ్యత అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ విషయాన్నీ శ్రీలంక పర్యాటక శాఖ మంత్రి హరిన్ ఫెర్నాండో వెల్లడించారు. ఇదే అంశంపై శ్రీలంక అధికారులు..అదానీ గ్రూప్ తో చర్చలు జరుపుతున్నట్లు అయన వెల్లడించారు. డీల్ ఓకే అయితే కొలంబో లోని బండారునాయకే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ తో పాటు, రాత్మలనా ఎయిర్ పోర్ట్, మట్టాల ఎయిర్ పోర్ట్ లు అదానీ గ్రూప్ చేతికి వచ్చే అవకాశం ఉంది. అదానీ గ్రూప్ ప్రస్తుతం భారత్ లో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు మొత్తం ఎనిమిది విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. శ్రీలంక తో డీల్ సెట్ అయితే అదానీ గ్రూప్ ఈ రంగంలో తొలిసారి అంతర్జాతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు అవుతుంది. రాబోయే రోజుల్లో విమానాశ్రయాల నిర్వహణ వ్యాపారాన్ని స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేసే ఆలోచనలో కూడా అదానీ గ్రూప్ ఉంది. ఈ విషయాన్ని గతంలో కంపెనీ అధికారికంగానే వెల్లడించింది. భవిష్యత్ లో ఏవియేషన్ రంగానికి మంచి లాభాలు ఉంటాయనే అంచనాతో అదానీ గ్రూప్ ఈ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి సిద్ధం అవుతోంది.

Next Story
Share it