Telugu Gateway
Top Stories

స్టాక్ మార్కెట్ లో అదానీ కల్లోలం

స్టాక్ మార్కెట్ లో అదానీ కల్లోలం
X

గత ఏడాది జనవరి లో బయటకు వచ్చిన అమెరికా కు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక స్టాక్ మార్కెట్ లో ఎంత ప్రకంపనలు రేపిందో అందరికి తెలిసిందే. ఆ తర్వాత అటు కేంద్ర ప్రభుత్వం కానీ..ఇటు స్టాక్ మార్కెట్ నియంత్రణా సంస్థ అయిన సెబీ కానీ ఈ విషయంలో ఏమి లేదు అని తేల్చేయటంతో తర్వాత మళ్ళీ ఎప్పటిలాగానే అదానీ షేర్లు స్టాక్ మార్కెట్ లో దూసుకెళ్లాయి. అదానీ కి సెబీ క్లీన్ చిట్ పై ఎన్నో అనుమానాలు ఉన్నా కూడా ఎవరూ ఏమి చేయలేని పరిస్థితి. ఇప్పటికి అంటే తాజాగా అమెరికా లో నమోదు అయిన కేసు వెలుగులోకి రావటానికి ఒక రోజు ముందు కూడా అదానీ గ్రూప్ కంపెనీ ఒకటి పీఎస్ పీ ప్రాజెక్ట్స్ లో వాటా కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇండియాలో పెద్ద ఎత్తున సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ తో పాటు మరో ఏడుగురు కలిసి అధికారులకు ఏకంగా 2029 కోట్ల రూపాయల మేర లంచాలు ఆఫర్ చేసినట్లు అభియోగాలు నమోదు అయ్యాయి. బ్రూక్లిన్ లోని ఫెడరల్ కోర్ట్ అభియోగాలు నమోదు చేయటంతో గురువారం ఉదయం భారతీయ మార్కెట్లు ప్రారంభం అయినప్పటి నుంచి అదానీ గ్రూప్ షేర్లు అన్నీ కుప్పకూలాయి. దీంతో ఇన్వెస్టర్లు భారీ ఎత్తున నష్టపోయారు. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ బ్రియాన్ పీస్ ఆదేశాల మేరకు పలు అభియోగాలతో కేసు నమోదు అయింది.

గౌతమ్ అదానీ తో పాటు మరి కొంత మందిపై కూడా అభియోగాలు నమోదు అయ్యాయి. బ్యాంకు లతో పాటు ఇన్వెస్టర్లకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి అదానీ కంపెనీ నిధులు సమీకరించినట్లు ఆరోపించారు. అమెరికా లోని ఇన్వెస్టర్ల నుంచి కూడా నిధులు సమీకరించి ఉండటంతో ఆ దేశం ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. లంచాల విషయం ద్వారా అదానీ కంపెనీ ఫారెన్ కరెప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్ సిఏపీ )ను ఉల్లఘించినట్లు అయింది. దీన్ని అమెరికాలో తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. హిండెన్ బర్గ్ ఆరోపణలు వచ్చినప్పుడు ఇది దేశం పై దాడిగా అదానీ గ్రూప్ స్పందిస్తే...మరి కొంత మంది పారిశ్రామికవేత్తలు కూడా ఇదే తరహాలో స్పందించారు. ప్రధాని మోడీ అండదండల కారణంగానే ఈ వ్యవహారం నుంచి బయటపడ్డారు అనే ఆరోపణలు లేకపోలేదు. అయితే ఇప్పుడు అదానీ తో పాటు మరి కొంత మందిపై పక్కా ఆధారాలతో కేసు నమోదు కావటంతో ఇప్పుడు అమెరికా గెలుస్తుందా...అదానీ గెలుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎవరు అవినీతి చేసిన చర్యలు తీసుకోవాల్సిన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఈ లావాదేవీలు అన్నీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగాయి అని చెప్పి ఈ విషయంలో మోడీ సర్కారు తప్పేమి లేదు అనే కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుండం విశేషం.తాజా పరిణామాల నేపథ్యంలో ఒక్క గురువారం నాడే అదానీ గ్రూప్ కంపెనీల విలువ రెండు లక్షల కోట్ల రూపాయల మేర తుడిచిపెట్టుకుపోయింది.

Next Story
Share it