Telugu Gateway
Top Stories

అదానీ ఫ్రాడ్ ...మోడీ సర్కారు మెడకు చుట్టుకుంటుందా?!

అదానీ ఫ్రాడ్ ...మోడీ సర్కారు మెడకు చుట్టుకుంటుందా?!
X

దేశ కార్పొరేట్ ప్రపంచంతో పాటు ఇన్వెస్టర్ల లో ఇప్పుడు ఒకటే చర్చ. అదానీ గ్రూప్ మోసాలు. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక లోని అంశాలతో రెండు సెషన్ల లో కలిపి అదానీ గ్రూప్ కు చెందిన నాలుగు లక్షల కోట్ల రూపాయల సంపద హరించుకు పోయింది. శుక్రవారం నాడు అదానీ గ్రూప్ లోని పలు షేర్లు కనిష్ట స్థాయిలకు పతనం అయ్యాయి. ఈ ప్రభావం మార్కెట్ లోని ఇతర షేర్లపై కూడా పడింది. ఒక వైపు అదానీ గ్రూప్ ఇది అంతా దురుద్దేశ పూరితం, తమ ఇమేజ్ ను దెబ్బతీసేందుకే ఇలా చేశారని కౌంటర్ ఇవ్వటంతో పాటు ఆ కంపెనీ పై న్యాయపరంగా ముందుకు వెళ్లే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. అయినా సరే హిండెన్‌బర్గ్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా తాము ఇచ్చిన రిపోర్ట్ కు కట్టుబడి ఉన్నామని...ఎలాంటి వాటిని అయినా ఎదుర్కొంటామని ప్రకటించింది. అదే సమయంలో తాము పక్కా ఆధారాలతో నివేదిక సిద్ధం చేశామని..తాము వేసిన 88 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కోరుతోంది. చూస్తుంటే ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో మరింత సంక్లిష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దీనిపై స్పందించింది. కాంగ్రెస్ నేత జై రామ్ రమేష్ ఈ మొత్తం వ్యవహారం పై సెబీ ,ఆర్ బి ఐ ల తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఇది సాధారణమైన గ్రూప్ కాదు అని..ప్రధాని మోడీ తో అయన ముఖ్యమంత్రి గా ఉన్నప్పటి నుంచి అనుబంధం గల కంపెనీ అంటూ వ్యాఖ్యానించారు. అదానీ గ్రూప్ పై సీరియస్ ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తాము తన రిపోర్ట్ కే కట్టుబడి ఉన్నట్లు ప్రకటిస్తున్న తరుణంలో ప్రభుత్వ పరంగా ఎలాంటి స్పందన లేకుండా ఉండటం సాధ్యం కాదని...గతంలో పలు కంపెనీలపై సీరియస్ ఆరోపణలు వచ్చినప్పుడు ఎలా స్పందించారో ఇప్పుడు కూడా అలాగే స్పందించాల్సిన అవసరం ఉంటుంది అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఖచ్చితంగా ఇది రాజకీయంగా కేంద్రంలోని బీజేపీ సర్కారును ఇరకాటంలోకి పెట్టడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఎప్పటినుంచో కేంద్రంలోని మోడీ సర్కారు అదానీ, అంబానీల ప్రభుత్వం అంటూ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మరో ఏడాదిలోనే ఎన్నికలు ఉన్న సమయంలో అదానీ గ్రూప్ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకోవటం వల్ల లక్షలాది ఇన్వెస్టర్లు ఇబ్బందుల్లో పడే ప్రమాదం కనిపిస్తోంది. కేంద్రం ఈ మొత్తం వ్యవహారంపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ ) ను రంగంలోకి దింపాలనే డిమాండ్స్ వచ్చే అవకాశం ఉందని చెపుతున్నారు.

Next Story
Share it