Telugu Gateway
Top Stories

ఆగని ఐపీఓల దూకుడు

ఆగని ఐపీఓల దూకుడు
X

ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్ దుమ్మురేపింది. పలు కీలక కంపెనీలు మార్కెట్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిధులు సమీకరించాయి. సెకండరీ మార్కెట్ పై అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సుంకాలతో పాటు కంపెనీల ఆర్థిక ఫలితాలు అంత మెరుగ్గా లేకపోవటం వంటి అంశాలు ప్రభావితం చేశాయి. దీంతో ఎక్కువ మంది ఇన్వెస్టర్లు కాస్త పేరున్న కంపెనీలు ఏది ఐపీఓ కి వచ్చినా కూడా వాటిలో ఇన్వెస్ట్ చేయటానికి ఎంతో ఆసక్తి చూపించారు. ఈ క్యాలెండరు ఇయర్ లో అంటే 2025 సంవత్సరంలో ఇప్పటివరకు కంపెనీలు అన్ని కలిపి లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగానే నిధులు సమీకరించాయి. తాజాగా మార్కెట్ లోకి వచ్చిన లెన్స్ కార్ట్ సొల్యూషన్స్, గ్రో లు కూడా మార్కెట్ లో లిస్ట్ అయ్యాయి. గ్రో మాతృ సంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ షేర్లు బుధవారం నాడు బిఎస్ఈ, ఎన్ఎస్ఈ ల్లో నమోదు అయ్యాయి.

గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) అంచనాలకు భిన్నంగా ఈ షేర్లు బిఎస్ఈ లో 114 రూపాయల వద్ద, ఎన్ఎస్ఈ లో 12 శాతం ప్రీమియం తో 112 రూపాయల వద్ద నమోదు అయ్యాయి. గ్రో షేర్లను వంద రూపాయల ధరతో జారీ చేసిన సంగతి తెలిసిందే. బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ ఐపీఓ ద్వారా 6632 కోట్ల రూపాయల నిధులు సమీకరించింది. ఈ ఇష్యూ కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందనే దక్కింది. గ్రో కు ప్రస్తుతం కోటి ఇరవై ఆరు లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. 26 శాతం మార్కెట్ వాటా తో గ్రో దేశంలో అతి పెద్ద స్టాక్ బ్రోకర్ గా ఉంది. 2017 లో ప్రారంభం అయిన ఈ బెంగళూరు బేస్డ్ కంపెనీ డైరెక్ట్ టూ కస్టమర్ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లాట్ ఫార్మ్ ను తీసుకొచ్చి విజయం సాధించింది. లిస్ట్ అయిన తర్వాత బిఎస్ఈ లో ఈ కంపెనీ షేర్లు 124 రూపాయలకు చేరాయి. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఇవి 122 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

Next Story
Share it