జగన్ సమావేశాలకూ పరిమళ్ నత్వానీ డుమ్మానేనా?.
ఆయన ఏపీ వ్యక్తే కాదు. కానీ అధికార వైసీపీ ఆయనకు ఏకంగా రాజ్యసభ సీటు ఇచ్చింది. ఈ సీటు కోసం అప్పట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అమరావతి వచ్చి మరీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఆయనకు రాజ్యసభ సభ్యత్వం వచ్చింది. రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశాలు వేటికీ ఆయన హాజరుకాలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో సీఎం జగన్ ను ఓ సారి వ్యక్తిగతంగా కలిశారు కానీ..పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు మాత్రం ఆయన వస్తున్న దాఖలాలు లేవని చెబుతున్నారు. పరిమళ్ నత్వానీ లాంటి రాష్ట్రేతరుడికి రాజ్యసభ సీటు ఇచ్చినా పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించి లేవనెత్తాల్సిన అంశాలపై అదీ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశాలకు కూడా ఆయన హాజరు కావటం లేదంటే ఆయన రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చని ఓ ఎంపీ వ్యాఖ్యానించారు. పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు ఇచ్చిన సమయంలోనే ఎన్నో విమర్శలు వచ్చాయి.
అయితే పరిమళ్ నత్వానీ వల్ల రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం కలగనుందని..ఆయన వల్ల ఏపీకి భారీ ఎత్తున పరిశ్రమలు వస్తాయని అప్పట్లో వైసీపీ నేతలు ప్రచారం చేశారు. ఆయన వల్ల కొత్తగా వచ్చిన పరిశ్రమలు ఏమీ లేకపోగా...ఆయన కీలక బాద్యతలు చూసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఏపీలోని చిత్తూరు జిల్లాలో తలపెట్టిన ఎలక్ట్రానిక్స్ యూనిట్ నుంచి కూడా వైదొలగింది. దీంతో ఏకంగా రాష్ట్రానికి రావాల్సిన వేల కోట్ల రూపాయల పెట్టుబడి వెనక్కిపోయినట్లు అయింది. అంతే కాదు పరిమళ్ నత్వానీ రాజ్యసభ సభ్యుడు అయిన తర్వాత అసలు ఏపీ గురించి ప్రస్తావించిన దాఖలాలు కూడా లేవని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అదే పరిమళ్ నత్వానీ కాకుండా మరో ఎంపీ ఎవరైనా ఇలా సీఎం జగన్ దగ్గర జరిగే సమావేశానికి రాకపోతే ఊరుకుంటారా అని ఓ నేత వ్యాఖ్యానించారు.