వైసీపీ మీడియా మేనేజ్ మెంట్ ఓ రేంజ్ లో ఉందే?!
మీడియా మేనేజ్ మెంట్. అధికారంలో ఉన్న పార్టీలు అనుసరిస్తున్న పద్దతే ఇది. అయితే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఒకప్పుడు ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి పేరు బాగా వినపడేది. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒకప్పుడు చంద్రబాబుపై పదే పదే ఇదే విమర్శలు చేసేది. ఇప్పటికీ చంద్రబాబు మీడియా మేనేజ్ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఏపీలోని అధికార వర్గాల్లో ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అధికార వైసీపీ కూడా ఇప్పుడు అదే బాటలో పయనిస్తుందని చెబుతున్నారు. దీని కోసం నెలకు లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలుగులో ఉన్న మీడియా అంతా పార్టీల వారీగా ముందే చీలిపోయి ఉంది. అందుకే దీన్ని కొత్తగా ఎవరూ మేనేజ్ చేయటం కూడా జరిగేఏ పని కాదు. విమర్శలు ఎన్ని వచ్చినా ఎవరి పని వాళ్లు చేసుకుంటూ పోవటమే. విచిత్రం ఏమిటంటే వైసీపీ మీడియా మేనేజ్ మెంట్ ఈ రేంజ్ లో ఉందా అని ఏపీలోని ఐఏఎస్ లు కూడా అవాక్కు అవుతున్నారు.ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కుటుంబానికి చెందిన తెలంగాణ టుడే వెబ్ సైట్ లో సీఎం జగన్ కు సంబంధించిన నెలవారీగా కార్యక్రమాలు వార్తగా ప్రచురించటం విశేషం.
ఏపీలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమం కవర్ చేస్తే అందులో తప్పుపట్టాల్సింది ఏమీ ఉండదు. తాజాగా వెల్లడైన ఎంపీటీసీ, జడ్పీటీసీల ఫలితాలను లీడ్ తీసుకుని వార్త రాశారు. అంత వరకూ బాగానే ఉన్న ఆ తర్వాత కింద ఒకదానికి ఒకదానికి సంబంధం లేని విషయాలను కూడా ప్రస్తావించారు. సహజంగా ఇలాంటి వార్తలు ఒకప్పుడు ప్రచురితమయ్యే ఆంధ్రప్రదేశ్ పత్రికలోనే సాధ్యమయ్యేది. అలాంటిది కెసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన పత్రికకు చెందిన వెబ్ ఎడిషన్ లో ఇలాంటి విచిత్ర వార్తలు రావటంతోనే ఇది ఖచ్చితంగా మీడియా మేనేజ్ మెంట్ లో భాగంగానే జరిగిందని..లేకపోతే ఎలా సాధ్యం అవుతుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణటుడేలో ప్రచురించిన వార్తలో కొన్ని పాయింట్లు ఇలా ఉన్నాయి..47 కార్పొరేషన్లకు 481 డైరక్టర్లను నియమించటం ద్వారా జగన్ మరోసారి సామాజిక న్యాయం చేశారు.
జిల్లా పరిషత్ ఛైర్మన్లు, ఎంపీటీసీల్లోనూ మహిళలకు, బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. విశాఖపట్నంలో అమెరికన్ కార్నర్ ప్రారంభించారు. ఫాక్స్ కాన్ ఎండీ జోష్ పాల్గుర్ సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. ఇలా సాగుతూ పోయింది ఈ వార్త. ఇది సెప్టెంబర్ 30న తెలంగాణ టుడే వెబ్ ఎడిషన్ లో ప్రచురితం అయింది. ఈ తరహా క్యాలెండర్ వార్తను సీఎం జగన్ కుటుంబానికి చెందిన సొంత పత్రిక సాక్షిలో కూడా రాదు. ఇలా పొరుగు రాష్ట్రాల పత్రికలతోపాటు ఎంపిక చేసిన జాతీయ మీడియాలో వార్తల కోసం వైసీపీ భారీ ఎత్తున వ్యయం చేస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు ఒక్కోసారి ఒక్కో శాఖ నుంచి నిధులు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మేనేజ్ మెంట్ లో భాగంగానే ఇలాంటి వార్తలు వస్తున్నాయని వాళ్లు ఉహదారణలతో సహా చూపిస్తున్నారు. ఇదే కాకుండా జాతీయ స్థాయిలో సీఎం జగన్, ఏపీ ఇమేజ్ బిల్డింగ్ కోసం 8 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు.