వైసీపీలో విజయసాయిరెడ్డి కలకలం!
వైసీపీ కీలకనేత, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న విజయసాయిరెడ్డి స్వయంగా సీఎం జగన్ కుటుంబానికి చెందిన సాక్షి మీడియాపై ఎటాక్ చేయటం ఆ పార్టీ నాయకులను షాక్ కు గురిచేసింది. ఇది ఓ రకంగా పెద్ద సాహసమే అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించటం విశేషం. రెండవసారి రాజ్యసభ రెన్యువల్ అయిన తర్వాత విజయసాయిరెడ్డి వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చిందని..ఢిల్లీలోని కీలక పెద్దలతో ఆయనకు ఏర్పడిన సాన్నిహిత్యంతో ఇక తనను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో ఆయన వ్యవహరిస్తున్నారని మరో నేత వ్యాఖ్యానించారు. అందుకే ఆయన ఈనాడులో వచ్చే వార్తలకు సాక్షి సరిగా కౌంటర్ చేయలేకపోతుందని స్వయంగా మీడియా సమావేశంలో వ్యాఖ్యానించటం ఇప్పుడు ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాక్షి పై విమర్శలు అంటే ఆయన స్వయంగా జగన్ ఫ్యామిలీపై ఎటాక్ ప్రారంభించినట్లునే భావించాల్సి ఉంటుందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తాను స్వయంగా మీడియా రంగంలోకి వస్తున్నానని..మరింత ఇరిటేట్ చేస్తే పేపర్ కూడా పెడతానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ఛానల్ పెట్టినా..పేపర్ పెట్టినా ఆ ప్రభావం సత్వరం పడేది సాక్షి గ్రూపుమీదే. ఎందుకంటే టీడీపీకి అనుకూల పత్రికలు, ఛానళ్లు ఉన్నా కూడా పాఠకులు..ప్రేక్షకులు చీలిపోయి ఉంటారు. ఒకే పార్టీకి మద్దతు ఇస్తున్నా కూడా ఎవరికి నచ్చిన ఛానల్ మాత్రమే వాళ్లు చూస్తారు. అలాగే ఇప్పుడు విజయసాయిరెడ్డి వెంటనే ఛానల్ పెట్టినా..తర్వాత పేపర్ పెట్టినా ఆ ప్రభావం ఖచ్చితంగా సాక్షి గ్రూపు మీదే ఉంటుందని ఓ నేత వ్యాఖ్యానించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలోనే విజయసాయిరెడ్డి వియ్యంకుడు అయిన అరబిందో గ్రూపుసంస్థల చేతిలోకి ఏపీలో భారీ ఎత్తున ప్రాజెక్టులు వెళ్లిన విషయం తెలిసిందే. వేలాది ఎకరాలతో కూడిన కాకినాడ సెజ్, కాకినాడ సీపోర్టు, రామాయపట్నం పోర్టు కాంట్రాక్టులు అన్నీ ఈ సంస్థలకే దక్కాయనే విషయం తెలిసిందే. ఏపీకి కేంద్రం కొత్తగా ప్రకటించిన ఫార్మా క్లస్టర్ కూడా అరబిందో చేతికే వెళుతుందని..ఈ క్లస్టర్ కు కేంద్రం దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకూ గ్రాంట్ కింద కేటాయించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ క్లస్టర్ లో మౌలికసదుపాయాల కల్పనకు ఈ నిధులు కేటాయిస్తారు. అంటే కాకినాడ సెజ్ భూముల్లో కేంద్రం డబ్బులతో మౌలికసదుపాయాలు డెవలప్ చేసి ఫార్మా కంపెనీలకు భూములు కేటాయించవచ్చన్నమాట. ఈ మూడేళ్లలోనే విజయసాయిరెడ్డి వియ్యంకుడి కంపెనీలకు ఒకేసారి ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు కేటాయిస్తున్నా కూడా భూ దందాలతో పార్టీ ప్రతిష్టను దెబ్బతీయటమే కాకుండా..ఏకంగా జగన్ ఫ్యామిలిని టార్గెట్ చేసినట్లు వ్యాఖ్యలు చేయటం ఏమిటో అర్ధం కావటంలేదని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. మరో కీలక విశేషం ఏమిటంటే విజయసాయిరెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చినా ప్రతి అంశంపై స్పందించే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి కానీ..ఉత్తరాంధ్రలో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ, వైజాగ్ పార్టీ ఇన్ చార్జి వై వీ సుబ్బారెడ్డి లాంటి నేతలెవరూ ఆయనకు మాట మాత్రంగా కూడా అండగా రాలేదు. పార్టీలో విజయసాయిరెడ్డి ఒంటరైనా..ఎవరినీ లెక్కచేయకుండా ముందుకెళుతున్నారనే మరో టాక్ కూడా ఉంది.
'3' క్ష అ
అ