Telugu Gateway
Telugugateway Exclusives

పోలవరంపై 'వైసీపీ కొత్త రాజకీయం'

పోలవరంపై వైసీపీ కొత్త రాజకీయం
X

కేంద్రంలోని మోడీ సర్కారు ఏపీతో ఆటలాడుకుంటోంది. ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలుపెట్టి అమరావతి, ఇప్పుడు పోలవరం విషయంలోనూ అదే ఆట. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్దలను ఎప్పటికప్పుడు కలిసినా ఏజెండాలో పోలవరం మాత్రం ఓ అంశంగా ఉంటుంది. కానీ సడన్ గా ఇఫ్పుడు కేంద్రం అకస్మాత్తుగా 2014 అంచనాల ప్రకారమే నిధులు ఇస్తామనే మెలిక పెట్టింది. ఇప్పుడు కొత్తగా ఈ తకరారు ఎందుకొచ్చింది?. తెలుగుదేశం హయాంలో పెంచిన అంచనాల్లో భారీ అవినీతి అంటూ బిజెపి, వైసీపీ అప్పట్లో తీవ్ర విమర్శలు చేశాయి. చివరకు ప్రధాని నరేంద్రమోడీ కూడా చంద్రబాబుకు పోలవరం ఓ ఏటీఎంలా మారిందని ఆరోపించారు. ఇక ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతల విమర్శల విషయం అయితే చెప్పాల్సిన పనిలేదు. మరి ప్రతిపక్షంలో ఉండగా అవినీతి అన్న అంచనాలను ఆమోదించాలని కేంద్రాన్ని పదే పదే కోరారు. నిజంగా చంద్రబాబు ఖరారు చేసింది అవినీతి అంచనాలు అయితే 'రివర్స్ టెండరింగ్'తో ఖజానాకు కోటి రూపాయలు కూడా నష్టం లేకుండా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వాటిని యతాతధంగా ఎందుకు ఆమోదించారు. మార్పులు చేయాలని కేంద్రాన్ని ఎందుకు కోరలేదు?.

చంద్రబాబు కేటాయించిన పనులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ తో 'ఆదా' చేసుకున్నామని చెప్పుకునే నేతలు మరి అంచనాల విషయంలో ఎందుకు రివర్స్ గేర్ వేశారన్నది సమాధానం లేని ప్రశ్న. ఇది ఒకెత్తు అయితే ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా చెబుతున్నట్లు అప్పటి చంద్రబాబు సర్కారు రాసిన లేఖల వల్లే కేంద్రం 2014 ధరల ప్రకారమే పోలవరం చెల్లింపులు చేస్తామని చెబుతుంటే ఇప్పటివరకూ జగన్ సర్కారు ఎందుకు మౌనంగా ఉంది. కేంద్రం చేతిలో చంద్రబాబు లేఖ ఉంటే కేంద్ర రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ (ఆర్ఈసీ) ఎందుకు ఏపీ సర్కారు పంపిన ప్రతిపాదనలు ఆమోదించినట్లు?. సీడబ్ల్యూసీకి చెందిన సాంకేతిక కమిటీ ఎందుకు ఆమోదించినట్లు?. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యయ అంచనాలు..అయినా ఇతర అంచనాలు అయినా ఖచ్చితమైన వివరాలు ఉండేది జలశక్తి శాఖ దగ్గర మాత్రమే. ఆ శాఖ ఆమోదించిన అంచనాలను ఆర్ధిక శాఖ వద్దు అంటోంది అంటే అది సాంకతిక సమస్యే తప్ప..మరొకటి కాదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ జోక్యం చేసుకుంటే ఈ సమస్య అలా పరిష్కారం అవుతుందని చెబుతున్నారు.

చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై కూడా వైసీపీ సర్కారు ఇంత వరకూ ఏమీ బహిర్గతం చేయటం లేదు. అమరావతిలో ఎవరు ఎక్కడ ఎకరం కొన్నా జాబితా బయటకు తీసిన వైసీపీ సర్కారు ఇంత పెద్ద ప్రాజెక్టులో మరి చంద్రబాబు అక్రమాలు, అవినీతిని ఎందుకు బయటపెట్టడం లేదు. చంద్రబాబు పంపిన అంచనాలనే ఆమోదించాలని ఇంత కాలం ఢిల్లీని పదే పదే కోరి..చంద్రబాబు లేఖల వల్లే ఇప్పుడు కేంద్రం అభ్యంతరం చెబుతుందనే వైసీపీ వాదనకు ఆమోదం లభిస్తుందా?. ఓ వైపు ప్రత్యేక హోదాపై చేతులెత్తేసిన వైసీపీ సర్కారు పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా కేంద్రం పూర్తి స్థాయిలో నిధులు తెచ్చుకోలేకపోతే రాజకీయంగా ఇది పెద్ద సమస్యగా మారటం ఖాయం అని అధికార వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. చూడాలి పోలవరం రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో. సవరించిన అంచనాలకు సంబంధించి ఇటీవల వరకూ సాక్షిలో వచ్చిన వార్తలు కూడా పెంచిన అంచనాలకు కేంద్రం ఆమోదం అన్న తరహాలోనే రాశారు తప్ప..ఎక్కడా కూడా చంద్రబాబు లేఖ వల్ల అంచనాలు పెరగటం లేదు అని రాయలేదు. కానీ వైసీపీ ఇప్పుడు కొత్తగా పాత చంద్రబాబు లేఖలే పోలవరం తాజా సమస్యకు కారణం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి.

Next Story
Share it