రోడ్డు ఫైట్..వైసీపీ కీలక నేత వర్సెస్ ఐఏఎస్.!
వైసీపీలో ఆయన కీలక నేత. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాం రోడ్డు అలైన్ మెంట్ విషయంలో ఆయనది ఓ దారి. ఆయన ప్రతిపాదనే ఢిల్లీకి వెళ్లింది. అయినా సరే కొర్రీల మీద కొర్రీలు పడుతున్నాయి. ఎంతకూ కేంద్రం నుంచి క్లియరెన్స్ రావటం లేదు. విషయం ఏమిటా అని ఆరా తీస్తే ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ ఢిల్లీలోని తన సహచర ఐఏఎస్ లతో కలసి దీనికి బ్రేక్ లు వేస్తూ వస్తున్నారు. దీని కోసం ఓ లాబీని కూడా ఆయన తయారు చేసుకున్నారు. వైసీపీ కీలక నేత ప్రతిపాదించిన అలైన్ మెంట్ అయితే విమానాల ల్యాండింగ్ సమయంలో చాలా సమస్యలు వస్తాయని..ఇది ఏ మాత్రం ఆమో్దయోగ్యం కాదంటూ మెలికలు పెట్టిస్తున్నారు. తాను అనుకున్న అలైన్ మెంట్ ఓకే అయితే ఆ వైసీపీ నేతకు..ఆయన సన్నిహితులకు భారీగా లబ్ది చేకూరనుంది. అందుకే ఢిల్లీలో ఆయన తన శక్తినంతటినీ వాడుతున్నా కూడా ఈ సీనియర్ ఐఏఎస్ లాబీ ముందు ఇప్పటి వరకూ ఆయన విజయం సాధించలేకపోయారు. ఏపీకి చెందిన ఈ ఐఏఎస్ తాను బినామీ పేర్లతో భారీ ఎత్తున కొనుగోలు చేసిన భూముల పక్కనుంచే ఈ విమానాశ్రయం రోడ్డు వెళితే భోగాపురం విమానాశ్రయానికి రోడ్డు..తనకు ట్రక్కులకు ట్రక్కులు డబ్బులు వస్తాయని లెక్కలేసుకుంటున్నారు. అన్నింటి కంటే విచిత్రం ఏమటంటే వైసీపీలో కీలక నేతను కూడా కాదని ఆ ఐఏఎస్ ఢిల్లీలో చక్రం తిప్పటం..ఈ రోడ్డు అలైన్ మెంట్ తాను కోరుకున్న విధంగా వచ్చేలా చూసుకొనేందుకు ప్రయత్నించటం అన్నది ఐఏఎస్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
వారం, పది రోజుల్లోనే కేంద్రం నుంచి దీనికి క్లియరెన్స్ వస్తుందని..ఇందులో వైసీపీ కీలక నేత విజయం సాధిస్తారా..లేక ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న ఐఏఎస్ జాక్ పాట్ కొడతారా అన్న చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. వైజాగ్ లో ప్రతి విషయం ఆ ఐఏఎస్ కు కొట్టినపిండే కావటంతో చాలా ముందు నుంచే వ్యూహాత్మకంగా అక్కడ భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారు..చేయించారు. ఆయన స్కెచ్ ఫలించి విమానాశ్రయాన్ని కనెక్ట్ చేసే రోడ్డు ఆయన భూముల పక్కనుంచే వెళితే ఆయన చాలా మంది రాజకీయ నేతల సంపాదను కూడా అధిగమించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది అధికార వర్గాల్లో. ఈ కీలక ఐఏఎస్ ఎక్కడా పెద్దగా హడావుడి లేకుండా తాను అనుకున్న పనులను అలవోకగా చేసుకోవటంలో..చేయించుకోవటంలో దిట్ట అన్న ప్రచారం ఉంది ఐఏఎస్ సర్కిల్స్ లో. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా కూడా ఈ విమానాశ్రయం పనులు ఏ మాత్రం ముందుకు సాగటం లేదు. మధ్యలో ఓ రోడ్డు కోసం వైసీపీ కీలక నేత, ఓ సీనియర్ ఐఏఎస్ తమ తమ స్వప్రయోజనాల కోసం ప్రయత్నించటంపై అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది.