షర్మిల పార్టీకి జగన్ ఇప్పుడు ఓకే చెప్పారా?..అప్పుడు వద్దని ఇప్పుడు తల్లిని ఎలా అనుమతించారు?
విజయమ్మ రాజీనామా..వైసీపీకి లాభమా..నష్టమా?!
రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. తొలుత చెల్లి. ఇప్పుడు తల్లి. వైసీపీ గౌరవ అధ్యక్ష్యరాలు పదవి నుంచి తప్పుకోనున్నట్లు విజయమ్మ వైసీపీ ప్లీనరీ వేదిక నుంచే ఆమె ప్రకటించారు. ఈ పదవి నుంచి తప్పుకోవటానికి ఆమె చాలా కారణాలే చెప్పారు. తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిలకు అండగా ఉండేందుకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు విజయమ్మ ప్రకటించారు. షర్మిల ఒంటరి పోరాటం చేస్తుందని..అందుకే ఆమె అండగా ఉంటానన్నారు. పదవికి రాజీనామా చేస్తున్నట్లు విజయమ్మ చెప్పిన సమయంలో ప్లీనరి వేదిక కింద ఉన్న వారిలో కొంత మంది వద్దు వద్దు అంటూ చేతులు ఊపారు. కానీ వేదికపై ఉన్న వారు కానీ..ఇతర నాయకులు ఎవరూ కూడా పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. విజయమ్మ ప్రసంగం తర్వాత వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి తల్లిని భావోద్వేగంగా హత్తుకున్నారు. అయితే ఈ సీన్ చూసిన వారెవరికైనా ముందస్తు ప్లాన్ ప్రకారమే విజయమ్మ రాజీనామా జరిగిందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. రాజీనామాపై విజయమ్మ ఏమి చెప్పినా..వైసీపీ నేతలు ఎలా సమర్ధించుకున్నా రాజకీయంగా ఈ అంశంపై విమర్శలు ఎదుర్కోకతప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఫస్ట్ చెల్లి..ఇప్పుడు తల్లే పార్టీని వదిలేశారు అంటూ ఎటాక్ చేయటం సహజం. అన్నింటి కంటే ఇక్కడ మరో కీలక అంశం తెరపైకి రానుంది.
వైఎస్ షర్మిల పార్టీ పెట్టిన సమయంలో వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో పార్టీ వద్దని పర్మిలకు జగన్, తామూ సూచించామని..రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు రావద్దనే వైసీపీ తెలంగాణ శాఖ విషయంలో కూడా తాము చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. మరి ఇప్పుడు విజయమ్మ ఏకంగా ప్లీనరీ వేదికగా..వైఎస్ జగన్ సమక్షంలో తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీకి అండగా ఉండటానికి పార్టీ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంటే ఇప్పుడు జగన్ తెలంగాణలో షర్మిల పార్టీకి ఆమోద ముద్ర వేసినట్లేనా అన్న కొత్త చర్చ తెరపైకి రావటం సహజం. తాను వద్దని చెప్పిన పార్టీకి..సేవలు అందించేందుకు వీలుగా తల్లి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినా జగన్ ఏమీ అనలేదంటే దానర్ధం ఏమన్నట్లు అన్న సందేహం రావటం సహజం. గత ఎన్నికల్లో వైసీపీ ఏపీలో అధికారంలోకి రావటానికి విజయమ్మతోపాటు షర్మిల కూడా కీలక పాత్ర పోషించారు. కారణాలు ఏమైనా మూడేళ్ళ వ్యవధిలోనే వీరిద్దరూ పార్టీని వీడటం అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలు ఖచ్చితంగా రాజకీయంగా జగన్ కు నష్టం చేకూర్చే అవకాశం ఉందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.