Telugu Gateway
Telugugateway Exclusives

ఓట్లు అడిగిన రాష్ట్రంలో సమస్యలపై షర్మిల మాట్లాడరా?

ఓట్లు అడిగిన రాష్ట్రంలో సమస్యలపై షర్మిల మాట్లాడరా?
X

ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదాతోపాటు అమరావతి ప్రస్తావనలు

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ షర్మిల ఏపీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఆమె నినాదం ' బై బై బాబు' బాగానే వర్కవుట్ అయింది. ఎన్నికల ప్రచారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారం రోజు కన్పించిన షర్మిల ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో ఎక్కడా కన్పించలేదు. సడన్ ఆమె తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్రకు రెడీ అయిపోయారు. పార్టీ ఏర్పాటుకు కూడా శరవేగంగా పావులు కదుపుతున్నారు. అయతే ఆమె పార్టీ భవిష్యత్ తేలటానికి ఇంకా చాలా సమయమే ఉంది. అయితే ఓట్లు అడిగిన రాష్ట్రంలోని సమస్యలపై, తాను ప్రచారం నిర్వహించిన కీలక అంశాలపై ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నా మరి షర్మిల మాట్లాడరా?. ఆమెకు ఈ అంశాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా?. షర్మిల తన ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా 'ప్రత్యేక హోదా' అంశాన్ని, అమరావతి అంశాలను విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

కేంద్రంలోని బిజెపి అయితే అసలు ప్రత్యేక హోదా ఈసే ఎత్తవద్దని చెబుతోంది. గత ఎన్నికల ముందు వైసీపీ విస్తృత ప్రచారాంశాల్లో ప్రత్యేక హోదా కీలకం అన్న విషయం తెలిసిందే. చంద్రబాబునాయుడు తన ఎంపీలతో రాజీనామా చేయిస్తే, వైసీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని..అప్పుడు ప్రత్యేక హోదా ఎలా రాదో చూద్దాం అంటూ జగన్ ప్రతిపక్షంలో ఉండగా సవాళ్లు విసిరారు. కానీ వైసీపీకి ఏకంగా 22 ఎంపీ సీట్లు గెలిపించినా ఇఫ్పుడు ప్రత్యేక హోద విషయంలో జరిగింది శూన్యం. విభజనతో నష్టపోయిన ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలోనే కాకుండా కడప స్టీల్ ప్లాంట్, ఓ భారీ ఓడరేవు వంటి విషయంలో కూడా ఏపీకి కేంద్రం హ్యాండ్ ఇచ్చింది. అయినా సరే ప్రధాని నరేంద్రమోడీని ముఖ్యమంత్రి చట్టబద్ధంగా రావాల్సిన ఏపీ హక్కులను ఎందుకు ఇవ్వరు ? అని ప్రశ్నించే సాహసం చేయరు.

మరి తన అన్న జగన్ కోసం ఏపీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన షర్మిల కేంద్రం నుంచి చట్టబద్ధంగా రావాల్సిన వాటిని తీసుకురావటంలో జగన్ విఫలం అవుతున్నా షర్మిల నోరెత్తరా?. ఏపీ సంగతి జగన్ చూసుకుంటారు ...నాకు తెలంగాణ వరకే సంబంధం అంటే రాజకీయంగా ఆమోదం లభిస్తుందా?. అసలు ఏపీ పెండింగ్ సమస్యలపై షర్మిల తన వైఖరి చెప్పగలరా?. చంద్రబాబు కేసులకు భయపడి అటు మోడీతో..కెసీఆర్ తో రాజీపడ్డారని ఆరోపించిన జగన్ ఇప్పుడు అదే మోడీ, అదే కెసీఆర్ తో ఏ విషయంలోనూ గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. విభజన జరిగి ఏడేళ్లు కావస్తున్నా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనకు సంబంధించిన సమస్యలు ఎన్నో ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. చంద్రబాబు హయాంలో తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏవో మొక్కుబడి సమావేశాలతో మమ అన్పించింది. ఇప్పుడు అసలు వాటి ఊసెత్తే వారే లేరు.

Next Story
Share it