జగన్ ఇప్పుడైనా మోడీ ముందు ఆ డిమాండ్ పెడతారా?!
ఎలా చూసుకున్నా బిజెపికి ఇప్పుడు వైసీపీ మద్దతు అత్యంత కీలకం. మరి ఈ పరిస్థితిని ఉపయోగించుకుని సీఎం జగన్ ప్రధాని మోడీ ముందు ప్రత్యేక హోదాతో పాటు ఇతర విభజన హామీలను పెడతారా లేదా అన్నది వేచిచూడాల్సిందే. కేంద్రంలో బిజెపికి పూర్తి మెజారిటీ వచ్చినందున ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రాన్ని అడుగుతూ ఉండటం తప్ప ఏమీ చేయలేమని జగన్ ఇప్పటికే చేతులెత్తేశారు. మరి ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల రూపంలో జగన్ కు ఓ ఛాన్స్ వచ్చింది. బిజెపి అభ్యర్ధి గెలవాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి. ఈ కీలక సమయంలో ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల డిమాండ్లు పెట్టి సాధించుకుంటే రాజకీయంగా అది జగన్ కు, వైసీపీ కి కూడా అత్యంత కీలకంగా మారుతుందనటంలో సందేహం లేదు. మరి కీలక ఛాన్స్ ను ఉపయోగించుకోకుండా జగన్ బిజెపి అభ్యర్ధికి భేషరతుగా మద్దతు ఇస్తే మాత్రం రాజకీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడున్నాయి. ఎన్నికలకు ముందు జగన్ తమకు మెజారిటీ ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రకటించారు. ఆయన అప్పట్లో కేంద్రంలో ఎవరికీ మెజారిటీ రాకపోతేనే ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పలేదు. గెలిచిన తర్వాత కొత్త కొత్త కండిషన్లను తెరపైకి తెచ్చారు.