Telugu Gateway
Telugugateway Exclusives

రేవంత్ రెడ్డి పై ఆ ఛానళ్ళకు అంత సడెన్ ప్రేమ ఎందుకొచ్చింది?

రేవంత్ రెడ్డి పై  ఆ ఛానళ్ళకు అంత సడెన్ ప్రేమ ఎందుకొచ్చింది?
X

పేరు వేయటానికి ఇష్టపడని వారు...ఇప్పుడు పొగడ్తల వర్షం

తెలంగాణలో కాంగ్రెస్ దే హవా అని ఆ చానళ్లు డిసైడ్ అయిపోయాయా?

రేవంత్ రెడ్డిపై ఆ రెండు ఛానళ్లకు సడన్ గా అంత ప్రేమ ఎందుకు వచ్చింది?. రేపు ఆ మూడవ ఛానల్ కూడ చేరుతుందని సమాచారం. ప్రస్తుతానికి అయితే రెండు రేవంత్ రెడ్డిని అనూహ్యంగా ప్రమోట్ చేసే పనిలో పడ్డాయి. నిన్న మొన్నటి వరకూ రేవంత్ రెడ్డి ఎన్ని ఉద్యమాలు చేసినా..పోరాటాలు చేసినా కాంగ్రెస్ పేరు మీద ఒకటి అరా స్క్రోలింగ్ లు పెట్టేవి కానీ..ఆయన పేరును కూడా వేయటానికి ఇష్టపడేవి కావు ఆ ఛానళ్ళు. అలాంటిది సడన్ గా ఇద్దరు ప్రముఖ పారిశ్రామికవేత్తల చేతిలో ఉన్న ఓ ఛానల్ సడన్ గా ఆదివారం నాడు రేవంత్ రెడ్డి తో గంటన్నరకుపైగా ఇంటర్వ్యూ ఇచ్చింది. అన్నీ పొగడ్తలతోనే సుమా. ఆ మరుసటి రోజే ఆ ఇద్దరు పారిశ్రామికవేత్తలకు వాటాలు ఉన్న మరో కీలక ఛానల్ కూడా రేవంత్ రెడ్డితో ఇంటర్వ్యూ ఇచ్చింది. అసలు పేరు వేయటానికి కూడా ఇష్టపడని వారు ఏకంగా గంటల కొద్ది ఇంటర్వూలు ఇవ్వటం ఏంటి?. అంతే కాదు ఓ ఛానల్ యాంకర్ అయితే ఏకంగా ఓ అడుగు ముందుకు వేసి రేవంత్ రెడ్డిని సాన పట్టిన కత్తిలా ఉన్నారని పొగడటం.

ఈ వ్యవహారం మీడియా సర్కిళ్ళలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి గత కొంత కాలంగా మైహోం రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డిలకు సంబంధించిన అక్రమాలపై తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చారు. రామేశ్వరరావుపై అయితే వ్యక్తిగతం కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన వీడియో సోషల్ మీడియాలో కూడా విపరీతంగా సర్కులేట్ అయింది. అలాంటి యాజమాన్యంలో ఉన్న ఛానళ్లు సడన్ గా రేవంత్ పై ప్రేమ కురిపించటానికి కారణం ఏంటి?. ఎవరు ఎవరితో రాజీకి వచ్చారు?. రేవంత్ రెడ్డి గతంలో చేసిన విమర్శలు..ఫిర్యాదులు ఇప్పుడు వదిలేస్తారా?. లేదు రేవంత్ రెడ్డి ఎలాగూ పీసీసీ ప్రెసిడెంట్ అవుతున్నాడు.

రేపు రేపు తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని సర్వేల్లో తాము సిద్ధహస్తులం అని చెప్పుకునే ఛానల్ నమ్ముతుందా?. బిజెపికి తెలంగాణలో అంత సీన్ లేదు అని నమ్మి...రేవంత్ రెడ్డితో రాజీకి వచ్చి ప్రమోట్ చేయటానికి వాళ్లంతా కలసికట్టుగా నిర్ణయం తీసుకున్నారా?. అసలు మీడియాలోని ప్రధాన ఛానళ్లలో ఏమి జరుగుతోంది?. తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోబు చేసుకోబోతున్నాయా?. ఈ మార్పు దేనికి సంకేతం. రాబోయే రోజుల్లో కానీ అసలు తెరవెనక ఏమి జరిగిందో వెల్లడి అయ్యే అవకాశం లేదు. తెలంగాణలోని బడా పారిశ్రామికవేత్తలతో రేవంత్ రెడ్డి కూడా రాజీకి వచ్చారనే ప్రచారం పరిశ్రమ వర్గాల్లో ఉంది. ఇందులో నిజం ఎంత ఉందో తేలాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. తాజాగా కూడా రేవంత్ రెడ్డి మీడియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఓ దశలో బాయ్ కాట్ కూ పిలుపునిచ్చారు.

Next Story
Share it