కెసీఆర్ లో ఇంత మార్పునకు కారణమేంటో?!
వ్యవసాయ శాఖ యాడ్ లో కేబినెట్ మొత్తానికి చోటు
అక్కడా కెటీఆర్ పై మాత్రం ప్రత్యేక ప్రేమ
తెలంగాణ సీఎం కెసీఆర్ పరిపాలనా తీరుపై చాలా విమర్శలే ఉన్నాయి. మంత్రులు లేకుండానే ఆయా శాఖల సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని. మంత్రులకు పలుమార్లు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని ఇటీవల టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటెల రాజేందర్ బహిరంగంగానే పలుమార్లు విమర్శించారు. ఓ సారి మంత్రి మహమూద్ అలీ ప్రగతి భవన్ గేటు దగ్గర నుంచి కాన్వాయ్ తో సహా వెనక్కి వెళ్లిన వీడియోలు సైతం హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఇది అంతా ఎందుకంటే సోమవారం నాడు ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. రైతు బంధు పథకం కింద తెలంగాణలో ఇప్పటివరకూ 50 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేసినందుకు పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. అందులో ఎప్పుడూలేని రీతిలో తెలంగాణ మంత్రివర్గం మొత్తానికి చోటు కల్పించారు. సహజంగా ఆయా శాఖల ప్రకటనల్లో ముఖ్యమంత్రితోపాటు మంత్రుల ఫోటోలు ఇవ్వటం సహజం. ఈ విధానం ఎప్పటి నుంచో అమల్లో ఉంది. అలా కాకుండా మంత్రివర్గం మొత్తం ఫోటోలను వ్యవసాయ శాఖ యాడ్ లో చేర్చటం ఆసక్తికర పరిణామంగా మారింది. అసలు కెసీఆర్ కు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వంలో చీమచిటుక్కుమనే ఛాన్స్ లేదు.
అలాంటిది ఇంత కీలక యాడ్ విషయంలో సీఎం కెసీఆర్ ఆమోదం లేకుండా వ్యవసాయ శాఖో..మరెవరో సొంతంగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉండదు. ఖచ్చితంగా ఇది కెసీఆర్ ఆమోదంతో జరిగినట్లునే భావించాల్సి ఉంటుంది. మంత్రులతోపాటు ఇందులో రైతు బంధు సమితి ప్రెసిడెంట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షడు బోయినపల్లి వినోద్ కుమార్ లకు కూడా చోటు కల్పించారు. మంత్రివర్గం మొత్తానికి ప్రభుత్వ ప్రకటనలో చోటు కల్పించటం మంచి సంప్రదాయమే. అయితే ఇక్కడ కూడా కెసీఆర్ కుటుంబ పాలన అన్న విమర్శలకు ఊతం ఇచ్చేలా కేబినెట్ మంత్రుల్లో ఒక్క కెటీఆర్ ఫోటోను మాత్రం ప్రత్యేకంగా హైలెట్ చేశారు. పోనీ అలా చేయటానికి కెటీఆర్ ఏమైనా ఉప ముఖ్యమంత్రా అంటే అదీ లేదు. అంటే ఈ యాడ్ ద్వారా కూడా తాము ప్రత్యేకం అని చూపించుకునే ప్రయత్నం చేశారు. వ్యవసాయ శాఖ యాడ్ లో అందరికీ చోటు కల్పించి మంచి పనిచేసిన సీఎం కెసీఆర్ తన కొడుకు ఫోటో దగ్గరకు వచ్చేసరికి మాత్రం ప్రత్యేక ప్రేమ చూపించారనే విమర్శలు విన్పిస్తున్నాయి.