Telugu Gateway
Telugugateway Exclusives

బాలకృష్ణ టూర్ పై టీడీపీకి ఎందుకంత కసి?!

బాలకృష్ణ టూర్ పై టీడీపీకి ఎందుకంత కసి?!
X

చంద్రబాబు, లోకేష్ తో విభేదించినందుకేనా?

జగన్ సర్కారుపై విమర్శలు చేసినా వదిలేశారు

బాలకృష్ణ టూర్ ను విస్మరించిన 'టీడీపీ ఫేస్ బుక్ పేజీ'

ఇతర నేతల కార్యక్రమాలకు మాత్రం చోటు

పార్టీలో చర్చనీయాంశంగా మారిన వ్యవహారం

తెలుగుదేశం ఎమ్మెల్యే, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ గత కొన్ని రోజులుగా తన నియోజకవర్గం హిందుపురంలో పర్యటిస్తున్నారు. అక్కడ నుంచే ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. తొలి రోజు ఏపీ మంత్రి కొడాలి నానికి హెచ్చరికలు చేశారు. ఆ తర్వాత సీఎం జగన్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఇది రాక్షస పాలన అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో ప్రజలు మేలు జరిగితే జగన్ పాలనలో ఏమీ జరగటం లేదని..చివరకు దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. సహజంగా ఇలాంటి విమర్శలు..అందులో నందమూరి బాలకృష్ణ లాంటి నేత చేస్తే ఆ విమర్శలను, పర్యటన కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ అధికారిక ఫేస్ బుక్ పేజీలో పెట్టాలి. కానీ బాలకృష్ణ టూర్ మొత్తాన్ని టీడీపీ అధికారిక పేజీ పూర్తిగా విస్మరించింది. సీఎం జగన్ పై, చివరకు మంత్రులపై పార్టీ నేతలు ఎవరు విమర్శలు చేసినా ఆ వీడియోలు తీసుకొచ్చి టీడీపీ ఫేస్ బుక్ పేజీలో పెట్టేవారు బాలకృష్ణ హిందుపురం టూర్ ను ఎందుకు పూర్తిగా విస్మరిస్తున్నారు. ఆ పేజీలో ఏకంగా 40 లక్షల మందిపైన సభ్యులు ఉంటారు. పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు, వర్ల రామయ్య, ఇతర నేతలను ప్రెస్ మీట్లను.. ఇతర అంశాలను టీడీపీ పేజీలో ఎప్పటికప్పుడు పెట్టే వారు.

కానీ బాలకృష్ణ టూర్ పట్టించుకోకపోవటంతో చంద్రబాబునాయుడు, నారా లోకేష్, బాలకృష్ణల మధ్య విభేదాలు అంత తీవ్ర స్థాయికి చేరాయా? అన్న చర్చ జరుగుతోంది. బాలకృష్ణ హిందుపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రైతు సమస్యలపై స్పందించారు. అయినా సరే టీడీపీ అధికారిక పేజీలో దానికి చోటు కల్పించలేదంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. తనకు 25 మంది సభ్యుల్లో ఒకడిగా పొలిట్ బ్యూరో సభ్యత్వం ఇవ్వటం బాలకృష్ణకు ఏ మాత్రం రుచించలేదు. తనకు ప్రత్యేకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావాలని పట్టుబట్టినట్లు పార్టీ వర్గాలు తెలపగా..'తెలుగు గేట్ వే.'నే తొలుత ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. పార్టీ పదవి విషయంలో కీలక నేతలుగా ఉన్న చంద్రబాబు, నారా లోకేష్, బాలకృష్ణల మధ్య విభేదాలు పొడసూపాయి. ఈ కారణంగానే ఆయనే నూతన కమిటీ ఏర్పాటు అయిన తొలిసారి జరిగిన పొలిట్ బ్యూరో సమావేశానికి కానీ, పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి డుమ్మాకొట్టారు. ఆ వెంటనే హిందుపురంలో ప్రజలతో మమేకం అవుతూ కార్యక్రమం చేపట్టారు.

Next Story
Share it