Telugu Gateway
Telugugateway Exclusives

రేవంత్ భ‌యంతోనే టీఆర్ఎస్ ఆక‌స్మిక ఎన్టీఆర్ జ‌పం!

రేవంత్ భ‌యంతోనే టీఆర్ఎస్ ఆక‌స్మిక ఎన్టీఆర్ జ‌పం!
X

అధికార టీఆర్ఎస్ కు అక‌స్మాత్తుగా దివంగ‌త ఎన్టీఆర్ పై ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది. అధికారంలోకి వ‌చ్చిన ఎనిమిదేళ్ల‌లో ఎప్పుడూ ఎన్టీఆర్ ఘాట్ వైపు క‌న్నెత్తి చూడ‌ని ఆ పార్టీ నేత‌లు ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా ఎందుకు వ్య‌వ‌హ‌రించారు. ఇందుకు కార‌ణం కేవ‌లం టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భ‌య‌మే అన్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. తెలంగాణ‌లో ఈ సారి తెలుగుదేశం ఓట్లు ఎవ‌రికి వెళ‌తాయి అన్న చ‌ర్చ సాగుతోంది?. సొంతంగా ఆ పార్టీ అభ్య‌ర్ధులు గెల‌వ‌లేక‌పోవ‌చ్చు..కానీ గెలుపును చాలా చోట్ల డిసైడ్ చేసే ఓట్లు ఆ పార్టీకి ఉన్నాయి. అందుకే ఇప్పుడు టీఆర్ఎస్ లో టెన్ష‌న్ ప్రారంభం అయింది. ఈ సారి ప్ర‌తి ఓటూ ఆ పార్టీకి ఎంతో కీలకం. ఎంత లేద‌న్నా కూడా క‌నీసం 15 నుంచి 20 సీట్ల‌లో గెలుపు, ఓట‌ముల‌ను డిసైడ్ చేసే ఓట్లు టీడీపీ సొంతం. చాలా కాలం టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి అక్క‌డ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గానూ ప‌నిచేసిన విష‌యం తెలిసిందే. ఆయన పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన త‌ర్వాత కూడా ఎప్పుడూ ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడిపై విమ‌ర్శ‌లు చేయ‌లేదు.

ఈ విష‌యంలో చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నారు. తెలంగాణ‌లో ఉన్న టీడీపీ యూత్ లో మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ పార్టీ కంటే రేవంత్ వైపే మొగ్గుచూపుతాయ‌న్న విష‌యం ప‌క్కా అని చెబుతున్నారు. దీన్ని బ్రేక్ చేసేందుకే టీఆర్ఎస్ అధినేత , సీఎం కెసీఆర్ ప్రోద్భ‌లంతో టీఆర్ఎస్ నేత‌లు, మంత్రులు ఎన్టీఆర్ ఘాట్ వైపు ప‌రుగెత్తారు. మ‌రి ఈ ప్ర‌యోగం ఎంత మేర‌కు ఫ‌లితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే. కొడంగ‌ల్ లో ఊహంచ‌ని రీతిలో ఓట‌మి పాలైన రేవంత్ రెడ్డి..ఆ త‌ర్వాత జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజిగిరి నుంచి గెలుపొంద‌టంలో తెలుగుదేశం ఓట్లు...ఏపీ ప్రాంత ప్ర‌జ‌ల ఓట్లు చాలా కీల‌క పాత్ర పోషించాయని చెప్పొచ్చు. ఈ సారి తెలంగాణ‌లో కొత్త పార్టీలు చాలానే పుట్టుకొచ్చాయి. అందులో వైఎస్ ష‌ర్మిల పార్టీతోపాటు మాజీ ఐపీఎస్ ప్ర‌వీణ్ కుమార్, కె ఏ పాల్ ప్ర‌జాశాంతి పార్టీతోపాటు.తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాను కూడా బ‌రిలో ఉండ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌ధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిల మ‌ధ్యే ఉన్నా కొత్త పార్టీలు ఎవ‌రి ఓట్లు చీలుస్తాయి...ఎవ‌రికి మేలు చేస్తాయ‌న్న‌ది ఎన్నిక‌లు జ‌రిగి ఫ‌లితాలు వ‌స్తే కానీ తేల‌దు.

Next Story
Share it