తెలంగాణ ఎడిషన్ లో ఈ వార్త వేయటానికీ సాక్షి భయపడిందా?
జల వివాదంపై ఏపీ ప్రభుత్వం తరపున ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఒకటే మాట చెబుతున్నారు. ఏపీ హక్కుల విషయంలో ఏ మాత్రం రాజీపడేది లేదని..ఎవరో రెచ్చగొడితే తాము రెచ్చిపోమని చెబుతున్నారు. ఏపీ హక్కులు ఎలా కాపాడుకోవాలో అలా కాపాడుకుంటామన్నారు. మంత్రులు కూడా ఇదే వాదన విన్పిస్తున్నారు. అయితే సోమవారం నాడు సాక్షి దినపత్రిక ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. అది ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ చేసిన ఫిఫ్టీ ఫిఫ్టీ వాదనపైనే ఫోకస్ పెట్టింది. కెసీఆర్ ఆకస్మాత్తుగా కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారనటంలో ఎలాంటి సందేహం లేదు. నీళ్ల పునర్ కేటాయింపులు జరగాలంటే మళ్లీ ట్రిబునల్స్, కేంద్రమో లేకపోతే కోర్టులో జోక్యం చేసుకుని క్రిష్ణా పరివాహక ప్రాంతాల రాష్ట్రాలతో చర్చించి ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అంతే కానీ..కెసీఆర్ ఇక నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ అనగానే కేటాయింపులు జరగవని ఓ నీటిపారుదల నిపుణుడు వెల్లడించారు. క్రిష్ణా జలాల పంపిణీ గతంలోనే జరిగిపోయింది. ఎవరికెన్ని నీళ్లు అన్న విషయాన్ని ట్రిబ్యునల్స్ నిర్ణయించాయి. గత ప్రభుత్వంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు అప్పట్లోనే తెలంగాణకు 34 శాతం క్రిష్ణా జలాలకు సంతకం చేశారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తాజాగా వెల్లడించారు. ఇవన్నీ ఒకెత్తు అయితే అర్ధభాగం అసంబద్ధం అంటూ సాక్షి పత్రిక ఏపీలో ప్రచురించిన కథనాన్ని తెలంగాణ ఎడిషన్ లో మాత్రం చాలా జాగ్రత్తగా ప్రచురించకుండా దాచేశారు.
తెలంగాణ సీఎం కెసీఆర్ వాదనకు కౌంటర్ ఇస్తూ రాసిన కథనం తెలంగాణలో పెట్టలేదంటే సాక్షి భయపడిందా? అన్న అనుమానం రావటం సహజమే. ఎందుకు కెసీఆర్ తో ఘర్షణ అన్న వైఖరితోనే జగన్ ఉన్నారా?. గత కొంత కాలంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డితోపాటు సీఎం జగన్ పై కూడా తెలంగాణ మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా సరే సాక్షి మాత్రం వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలిస్తే ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని జాగ్రత్తపడినట్లు ఉందని ఓ నేత వ్యాఖ్యానించారు. వాస్తవాలతో కూడిన వార్త ప్రచురించటానికే భయపడిన వారు పోరాటం చేస్తారంటే ఎవరైనా నమ్ముతారా అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది రాజకీయంగా ఆయనకు పెద్ద మైనస్ గా మారటం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2015 జూన్ 19న జరిగిన కేటాయింపులకు తెలంగాణ అంగీకరించినట్లు సాక్షి తన కథనంలో పేర్కొంది. బచావత్ ట్రిబ్యునల్ క్రిష్ణా జలాల్లో ఎక్కువ వాటా ఏపీకే అని స్పష్టం చేసిందని అన్నారు.