కోకాపేట భూముల విషయంలో రేవంత్ రెడ్డి కామ్ ఎందుకు అయ్యారు?
హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానన్న రేవంత్
బిజెపి-టీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు తేలిపోతాయంటూ ప్రకటన
వెయ్యి కోట్ల స్కామ్ అని సంచలన ఆరోపణలు
కోకాపేట భూములు కొద్దిరోజుల క్రితం ఓ వైపు కేక .. మరో వైపు కాక కూడా పుట్టించాయి. కానీ సడన్ అంతా కామ్ ఎందుకు అయిపోయింది?. ఈ భూముల వేలం వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేసిన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఎందుకు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు?. ఇది అటు కాంగ్రెస్ పార్టీతోపాటు అధికార వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ భూముల వేలంపై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి నాలుగు రోజుల్లో ప్రభుత్వం ఈ వేలాన్ని రద్దు చేసి..స్విస్ ఛాలెంజ్ పద్దతిలో విక్రయానికి ముందుకు రావాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ వ్యవహరంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తానని..ఈ ఫిర్యాదు కాపీలను బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా అందజేస్తానన్నారు. అంతే కాదు..దీంతో బిజెపి-టీఆర్ఎస్ మధ్య ఉన్న చీకటి ఒప్పందాలు కూడా బహిర్గతం అవుతాయని వ్యాఖ్యానించారు. కెసీఆర్ ను అరెస్ట్ చేయిస్తానంటున్న బండి సంజయ్ ఈ కోకాపేట భూముల విషయంలో ఏమి చేస్తారో చూస్తానని మీడియా ముఖంగా ప్రకటించారు రేవంత్ రెడ్డి. కానీ సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి విమర్శల తర్వాత తెలంగాణ సర్కారు ఓ ప్రకటన విడుదల చేసింది. అంతా పారదర్శకంగానే జరిగిందని..స్విస్ ఛాలెంజ్ విధానం కూడా సాధ్యంకాదని ప్రకటించింది. అంతే కాదు..అందులో విచిత్రంగా ఏదో ఆఫర్ ఇచ్చినట్లు ఇప్పటివరకూ చేసిన ఆరోపణలు ఏవో చేశారు..ఇకపై విమర్శలు చేస్తే మాత్రం న్యాయపరంగా ముందుకెళతామని అందులో పేర్కొంది. ప్రభుత్వం వివరణ ప్రకటన వచ్చిన తర్వాత నుంచి కూడా రేవంత్ రెడ్డి అధికారికంగా ఈ అంశంపై స్పందించిన దాఖలాలు లేవు. ప్రభుత్వానికి నాలుగు రోజులే గడువు ఇస్తున్నానని..అప్పటివరకూ స్పందించకకపోతే కేంద్ర మంత్రి హోం మంత్రి అమిత్ షాకి అధికారికంగా ఫిర్యాదు చేస్తానన్న రేవంత్ రెడ్డి ఈ వార్త పబ్లిష్ చేసే సమయం నాటికి లేఖ రాసిన దాఖలాలు అయితే లేవు. కోకాపేట భూముల్లో ధర్నాలకు ప్రయత్నం చేసిన తర్వాత ఈ వ్యవహరంపై కాంగ్రెస్ పార్టీ సడన్ గా సైలంట్ అవటం వెనక కారణాలు ఏమై ఉంటాయా అన్న చర్చ సాగుతోంది.
మీడియా సాక్షిగా ప్రకటించినట్లు కోకాపేట భూముల వేలంపై రేవంత్ లేఖ రాయకపోతే అనవసర విమర్శలకు ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. అంతే కాకుండా రాజకీయ భవిష్యత్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న రేవంత్ ఇమేజ్ కు కూడా నష్టం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కోకాపేట భూముల వేలానికి సంబంధించి రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. పక్కపక్కనే ఉన్న భూముల్లో ఒక ఎకరా అరవై కోట్ల రూపాయలు పలికి..మిగిలిన వాటికి మాత్రం రకరకాల ధరలు పలకటంపై కూడా రేవంత్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఈ వేలంలో పాల్గొన్న కంపెనీల చరిత్ర ఇదిగో అంటూ పలు ఆధారాలు బహిర్గతం చేశారు. కోకాపేట వేలంలో వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు.. అంతే కాదు..వేలంలో ఇతర సంస్థల పాల్గొనకుండా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రియల్ సంస్థలను బెదిరించారని తీవ్ర ఆరోపణలు చేశారు. అదే సమయంలో ఆయన కుటుంబానికి చెందిన రాజపుష్ప రియల్ ఎస్టేట్ అక్రమాలు ఎన్నో ఉన్నాయని..వాటి అన్నింటిని బహిర్గతం చేస్తానని హెచ్చరించారు. రేవంత్ ఒక్కరే కాదు..బిజెపి నేతలు కూడా కోకాపేట భూమల విషయంలో సైలంట్ అయిపోయారు. కొద్దిరోజుల పాటు వేలాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర ప్రకటనలు చేశారు.