Telugu Gateway
Telugugateway Exclusives

కెసీఆర్..నమస్కారాల్లో ఎందుకింత తేడా?

కెసీఆర్..నమస్కారాల్లో ఎందుకింత తేడా?
X

ఇద్దరూ కేంద్ర మంత్రులే. ఒకరు జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్. మరొకరు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఇద్దరికి నమస్కరించటంలో ఎంత తేడా. నమస్కరించటం భారతీయ సంస్కృతిలో ఓ భాగం. అందులో ఆక్షేపించాల్సింది ఏమీ లేదు. కానీ సీఎం కెసీఆర్ వయస్సులో తన కంటే ఎంతో చిన్నవాడైన అమిత్ షా దగ్గర మాత్రం బాగా వంగి నమస్కారం పెట్టారు. అదే గజేంద్ర సింగ్ షెకావత్ కు మాత్రం మామూలుగా నమస్కారం పెట్టారు. ఈ నమస్కారాల్లో తేడా ఎందుకు?. దీనికి కారణం ఏమిటి? అంటే ఈ విషయాన్ని ఊహించటం పెద్ద కష్టమేమీ కాదు. షెకావత్ ఓ కేంద్ర మంత్రి. కానీ అమిత్ షా దేశంలోనే అత్యంత శక్తివంతమైన కేంద్రం. మోడీ తర్వాత స్థానం ఆయనదే. ఒక్క మాటలో చెప్పాలంటే మోడీ, అమిత్ షా ఒక్కరే అనొచ్చు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కెసీఆర్ వరస పెట్టి కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారు.

తెలంగాణలో అనూహ్యంగా పుంజుకుంటున్న బిజెపి త్వరలోనే సీఎం కెసీఆర్ అవినీతిపై కూడా చర్యలు ఉంటాయని ప్రకటిస్తున్న తరుణంలో ఈ భేటీలు జరగటం, అమిత్ షాకు కెసీఆర్ నమస్కరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. గత కొంత కాలంగా సీఎం కెసీఆర్ కేంద్రంలో అధికారం చలాయించిన కాంగ్రెస్, బిజెపిలు దేశాన్ని గాడిన పెట్టడంలో విఫలం అయ్యాయని..వీరిద్దరూ వేస్ట్ అంటూ మాట్లాడారు. తనను చూసి ఢిల్లీ గజగజ వణుకుతుందని జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రకటించారు కెసీఆర్. ఆ ఎన్నికల ప్రచారంలో మంత్రి కెటీఆర్ అయితే ఓ అడుగు ముందుకేసి హైదరాబాద్ గులాబీలు కావాలా..గుజరాత్ గులాములు కావాలా అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీలో కెసీఆర్ వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Next Story
Share it