ఈ 'మురళీ'గానం ఎవరి కోసం?
జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ పాలకవర్గానికి సంబంధించి ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత కమిటీలో ఉన్న వారందరూ కలసి పోటీచేసిన వారే. అంతే కాదు.. పాత కమిటీ అక్రమాలు, అవినీతితో విసిగివేసారిన సభ్యులు ఈ కొత్త కమిటీకి అఖండ విజయం కట్టబెట్టారు. అప్పుడు అందరూ చెప్పింది గత కమిటీ అక్రమాలు వెలుగులోకి తెస్తామనే. అవినీతిరహిత సేవలు అందిస్తామని. కొత్త కమిటీ ఈ మధ్య ఓ వివాదంలో మీడియా ముందుకు వచ్చి మరీ గత కమిటీ అక్రమాలపై శ్వేతపత్రం ప్రకటించనున్నట్లు కూడా తెలిపింది. కానీ ఇంత వరకూ అది జరగలేదు. పైగా జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ తోపాటు ఇతర మేనేజింగ్ కమిటీ సభ్యులు ఫైల్స్ కోసం కార్యదర్శి మురళీ ముకుంద్ తో ఘర్షణ పడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?.
ప్రెసిడెంట్ తోపాటు ఇతర మేనేజ్ మెంట్ కమిటీ సభ్యులు తనను బెదిరించారని..ఫైళ్లు ఉన్న రూమ్ కు పోలీసు భద్రత కల్పించాల్సింది గా మురళీ ముకుంద్ ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. ఈ మురళీగానం ఎవరి కోసం అన్న చర్చ కమిటీ సభ్యులు, సొసైటీ సభ్యుల్లో వ్యక్తం అవుతోంది. పైగా మురళీ ముకుంద్ తాను సహకార శాఖ కమిషనర్, రిజిస్టార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కు రాసిన లేఖలోనే గత కమిటీ హయాంలో సొసైటీ ఫైళ్ళతోపాటు కీలక రికార్డులు మాయం అయ్యాయని ఫిర్యాదు చేశారు. గత అక్రమాలను వెలికితీస్తామని కమిటీ అధికారంలోకి వచ్చి..సొంత కమిటీ సభ్యులపైనే..అది కూడా కార్యదర్శి ఆరోపణలు చేయటం, పిర్యాదులు చేయటం సొసైటీ సభ్యుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
జూబ్లిహిల్స్ సొసైటీ ప్రెసిడెంట్ నన్ను బెదిరించారు
జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీలో నిత్యం వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి. ఓ సభ్యుడి ఇంటికి అనుకుని ఉన్న మూడు వందలపై చిలుకు గజాల రెగ్యులరైజేషన్ కు కొత్త కమిటీ ఆమోదపత్రం ఇవ్వగానే..సహకార శాఖ నుంచి అది ముందుకు వెళ్ళకుండా ఆదేశాలు తెచ్చేశారు. ఇప్పుడు హౌసింగ్ సొసైటీకి సంబంధించిన పైళ్లు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని ప్రెసిడెంట్ తోపాటు ఇతర కమిటీ సభ్యులు తనను బెదిరించారంటూ సొసైటీ కార్యదర్శి మురళీ ముకుంద్ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రెసిడెంట్ తోపాటు కొంత మంది మేనేజ్ మెనేజ్ మెంట్ కమిటీ సభ్యులు బెదిరించారన్నారు. సొసైటీ బై లాస్ ప్రకారం రికార్డులు తన దగ్గరే ఉంటాయని..మేనేజ్ మెంట్ కమిటీ సభ్యులు, ఆఫీసు బేరర్లు ఎప్పుడు అడిగినా వాటిని చూపిస్తున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
రికార్డుల కోసం రూమ్ బద్దలుకొట్టి, పైళ్ళు తీసుకెళ్ళే అవకాశం ఉన్నందున వెంటనే రికార్డుల రూమ్ కు భద్రత కల్పించాలని కోరారు. కార్యదర్శి మురళీ ముకుంద్ మరో లేఖను సహకార శాఖ కమిషనర్, రిజిస్టార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ రాశారు. అందులో పాత కమిటీ ఫైల్స్ ను కొత్త కమిటీకి అప్పగించలేదని..అంతే కాకుండా కొన్ని ఫైళ్లు, రికార్డులు కూడా మిస్ అయ్యాయని తెలిపారు. సొసైటీ కార్యదర్శిగా తాను ఈ నెల 11 న జరిగిన సమావేశంలో రెండు గంటలపాటు కూర్చున్నానని..కమిటీ ప్రెసిడెంట్, ఇతర మేనేజ్ మెంట్ కమిటీ సభ్యుల ఒత్తిడి తట్టుకోలేక అక్కడి నుంచి బలవంతంగా బయటకు పోవాల్సి వచ్చిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.