ఫ్రీ గా వచ్చే ఇసుకను ప్రభుత్వం ఎందుకు అమ్ముతుంది మరి?
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లాజిక్ ను ఫార్మా కంపెనీలకు వర్తింపచేస్తారా?
ప్రైవేట్ ఆస్పత్రిలోనూ ధరల బోర్డులు పెట్టిస్తారా?
సినిమా నిర్మాణ వ్యయం ఎంత?. హీరో...హీరోయిన్ల రెమ్యునరేషన్లు ఎంత?. రెమ్యునరేషన్లు తగ్గించుకుంటే ఈ టిక్కెట్లు రేట్లు సరిపోతాయి. ప్రజల డబ్బుతో హీరోలకు కోట్ల రూపాయలు ఇవ్వాలా?. ఇవీ ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లేవనెత్తిన సందేహలు. ఎస్. ఇందులో లాజిక్ ఉంది. కాదని అనలేం. కానీ ఎంతో బాధ్యతతో వ్యవహరించాల్సిన ప్రభుత్వం...పేదల దగ్గర నుంచి ,మధ్యతరగతి వాళ్ళకు అత్యవసరం అయిన ఇసుకను ఎందుకు అమ్ముతోంది. అదీ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి మరీ ఎందుకు అమ్మిస్తోంది. ఇసుక ప్రభుత్వం తయారు చేసింది ఏమీ కాదు. అది సహజసంపద. సహస సంపదను ప్రభుత్వమే అమ్మి సొమ్ము చేసుకోవచ్చు అన్న మాట. నిజంగా ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తే ఇళ్లు కట్టుకునే వారికి ఎంతో వెసులుబాటు కల్పించినట్లు అవుతుంది. మంత్రి అనిల్ కుమార్ లాజిక్ ఒక్క సినిమా టిక్కెట్ల వరకే వర్తింపచేస్తారా?. మరి ఫార్మా కంపెనీలు మందుల తయారీకి చేస్తున్న వ్యయం ఎంత?. అవి వసూలు చేస్తున్న ధరలు ఎంత?. దీనికి ఏమైనా నియంత్రణ ఉందా?. ఏ పేరున్న డాక్టర్ ను అడిగినా ఫార్మా కంపెనీల దోపిడీని కళ్ళకు కట్టినట్లు చెబుతారు.
నిజంగా జగన్ ప్రభుత్వం కనుక సినిమాలకు తీస్తున్న లాజిక్ లు..లెక్కలను తీసి ఫార్మా కంపెనీల విషయంలో కూడా అమలు చేస్తే ఏపీ సీఎం జగన్ ను ప్రజలు దేవుడుగా కొలుస్తారు. సినిమా టిక్కెట్లది ఏమి ఉంది..జనాభాలో ఏభై శాతం మంది సినిమాలు చూస్తారేమో. కానీ మందులు ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా సార్లు అవసరం పడతాయి. అసలు ఏపీలో సినిమా సినిమా ప్రేక్షకులు ఎవరూ కూడా రేట్లు భరించలేని రీతిలో ఉన్నాయని..వీటిని తగ్గించాలని డిమాండ్ చేసిన దాఖలాలు లేవు. కానీ ఏపీ ప్రభుత్వమే రాజకీయ 'టార్గెట్' గా సినిమా టిక్కెట్ల అంశాన్ని తీసుకుంది. దీని వెనక రాజకీయ కారణాలతోపాటు పలు ఇతర అంశాలు కూడా ఇమిడి ఉన్నాయనే విషయం బహిరంగ రహస్యమే. నిజానికి ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి.
కానీ వాటిని కాదని సినిమా టిక్కెట్ ధరలతోపాటు అంతా ఓ టార్గెట్ ప్రకారమే వెళుతున్నారని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సమాజంలో ఇప్పుడు పలు మార్గాల్లో దోపిడీ సాగుతోంది. కానీ అన్ని దోపిడీలను వదిలేసి..ఒక్క సినిమా దోపిడీనే టార్గెట్ చేయటం వెనక ప్రజలు లాజిక్ ను ప్రజలు కనిపెట్టలేరా?. అసలు నిర్మాణ వ్యయం ఎంత?. రెమ్యునరేషన్లు ఎంత అన్న లెక్కలు మాట్లాడితే ప్రజలు కూడా రేపు రేపు సిమెంట్ కంపెనీ బస్తా తయారీకి ఎంత అవుతుంది?. స్టీల్ టన్ను తయారీకి ఎంత అవుతుంది?. లాభం 15 నుంచి 20 శాతం మించి ఉండటానికి వీల్లేదు. అప్పుడు మాత్రమే మేం కొంటాం.
ప్రభుత్వం సినిమా టిక్కెట్లకు వర్తించిన లాజిక్ ను ఫార్మా, స్టీల్, సిమెంట్ కంపెనీలకు..ఉచితంగా దొరికే ఇసుకను ప్రభుత్వం ఎలా అమ్ముకుంటుంది అని ప్రశ్నించటం ప్రారంభిస్తే ఏమి అవుతుందో?.!. ఏపీలో ఇప్పుడు ప్రభుత్వమే మద్యం విక్రయాలు చేస్తోంది. మరి మద్యం కంపెనీల ఉత్పత్తి వ్యయం ఎంత?. వాటి అమ్మకం రేటు ఎంత?. ఈ లెక్కలు కూడా చూస్తారా?. పేదలకు సినిమా టిక్కెట్లలాగానే కారుచౌకగా మద్యం అందుబాటులోకి తెస్తే మందుబాబులు కూడా ఏపీ ప్రభుత్వాన్ని పది కాలాల పాటు గుర్తుపెట్టుకుంటారు కదా. కానీ నిన్న మొన్నటి వరకూ ఎక్కడా లేని రేట్లు ఏపీలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే కదా?.