బిజెపి స్ట్రాంగ్ ...ఆ సామాజిక వర్గానికి పదవుల పంట!
కాంగ్రెస్ వీక్...పీవీ కూతురికి ఎమ్మెల్సీ పదవి హుళక్కి?
కెసీఆర్ నియామకాలు ఓట్లు రాలుస్తాయా?!
జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు హడావుడి
అధికార టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో గతంలో ఎన్నడూలేని రీతిలో టెన్షన్ పడుతోంది. అందుకే ఈ ఎన్నికల ముందు వరస పెట్టి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా బిజెపికి దగ్గర ఉంటారనే పేరున్న సామాజిక వర్గాన్ని ఎంచుకుని ఏకంగా ఒకేసారి మూడు పోస్టులు ఇవ్వటంతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల నుంచి సీఎం కెసీఆర్ దివంగత ప్రధాని పీవీ నరసింహరావుపై అపారమైన ప్రేమ చూపించటం స్టార్ట్ చేశారు. ఒకప్పుడు పీవీపై తీవ్ర విమర్శలు చేసిన కెసీఆర్ కారణాలు ఏమైనా పీవీ జపం అందుకున్నారు. ఓ దశలో పీవీ కూతురు వాణికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనిపై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. చివరకు ఆమె కూడా టీఆర్ఎస్ ఇస్తే తాను పదవి తీసుకుంటానని ప్రకటించారు. కాంగ్రెస్ ను దెబ్బకొట్టటానికి వ్యూహంలో భాగంగానే ఇదంతా చేశారనే విషయం ఇప్పుడు నిరూపితం అవుతుంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్, బిజెపి ల మధ్య అనే విషయం స్పష్టం అయిపోయింది. దుబ్బాక ఉఫ ఎన్నిక ఫలితాలతో తెలంగాణలో బిజెపి ప్రత్యామ్నాయ పార్టీగా అవతరిస్తుందనే విషయం తెలియటంతో సీఎంకెసీఆర్ కూడా ఎమ్మెల్సీల విషయంలో 'లెక్కలు' మార్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పెద్ద ప్రత్యర్ధి కాదు కాబట్టి పీ వీ కూతురికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరం తక్షణమే లేదు. అందుకే ఎమ్మెల్సీ సీటును బిజెపికి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న సామాజిక వర్గానికి చెందిన దయానంద్ ను తెరపైకి తెచ్చారు. ఆయనకు అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అంతే కాదు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్ టీడీసీ) ఛైర్మన్ పదవి శ్రీనివాస్ గుప్తాకు ఇఛ్చారు. మళ్ళీ వెంటనే తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి (టీఎస్ఐడీసీ) ఛైర్మన్ పదవి అమరవాది లక్ష్మీనారాయణకు దక్కింది.
ఒకే సామాజిక వర్గానికి రెండు ఛైర్మన్ పోస్టులు, ఒక ఎమ్మెల్సీ పోస్టువెంటవెంటనే ఇవ్వటం ఇవ్వటం అనేది బహుశా ఇదే మొదటిసారి కావొచ్చేమో. ఈ నియామకాలు చూస్తేనే బిజెపి విషయంలో అధికార టీఆర్ఎస్ ఎంత టెన్షన్ గా ఉందో అర్ధం అవుతుందని రాజకీయ వర్గాల్లో వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. అంతే కాదు స్వయంగా టీఆర్ఎస్ నేతలు కూడా ఇవి చూసి ఆశ్చర్యతున్నారు. తెలంగాణ సర్కారు నియామకాలు అయితే చేసింది కానీ..ఈ పోస్టులు దక్కించుకున్న వారు అధికార టీఆర్ఎస్ కు ఏమైనా ఓట్లు రాల్చగలుగుతారా?. ఈ నియామకాలు చూసి ఆ సామాజిక వర్గ ప్రజలు తమ ఓట్లు అన్నీ గుండుగుత్తగా టీఆర్ఎస్ కు వేస్తారా?. అంటే అనుమానమే అని చెప్పకతప్పదు. ఇఫ్పుడు కొత్తగా పదవులు దక్కించుకున్న వారిలోని కొంత మందిపై సొంత సామాజిక వర్గంలోనే తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతున్నారు.