'దళిత బంధు పైలట్' ప్రాజెక్టు పక్కకెందుకు మళ్లింది
కెసీఆర్ ప్రతి పనికీ ఓ లెక్క ఉంటది
వాసాలమర్రి లో దళితబంధు వెనక కథ అదే!
తెలంగాణ సర్కారు ప్రస్తుతం దళిత బంధు జపం మాత్రమే చేస్తోంది. అందరి నోటా అదే మాట. మరి ఇప్పుడు అకస్మాత్తుగా పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని తలపెట్టిన హుజూరాబాద్ నియోజకవర్గం కాకుండా అకస్మాత్తుగా వాసాలమర్రి ఎందుకు తెరపైకి వచ్చింది. ఈ పథకం అమలు కోసం 76 కుటుంబాలను ఎంపిక చేయటం..వారి ఖాతాల్లో గురువారం నాడే నిధులు జమ చేయనున్నట్లు ప్రకటించటం వెనక మతలబు ఏమిటి? పైలట్ ..పరీక్ష లేకుండానే నేరుగా వాసాలమర్రిలో ఎందుకు దళిత బంధు విమానం దింపారు. అంటే దీని వెనక చాలా పెద్ద కథే ఉంది అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఇప్పటికే హుజూరాబాద్ లో ఈ పథకం అమలుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఉప ఎన్నికలు ఉన్న తరుణంలో ఇలాంటి స్కీమ్ అమలు చేయటం సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన కుటుంబాలకు మాత్రమే అమలు చేసే ఈ పథకం ఒక్క హుజూరాబాద్ వచ్చేవరకూ మాత్రం ఏకంగా 1500-2000 కోట్ల వరకూ వెళ్ళనుంది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ పథకం అమలుకు సంబంధించి సమీక్ష సమావేశంలోనే వెల్లడించారు. ఎన్నికల సంఘానికి వెళ్ళిన ఫిర్యాదు వల్లే ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నందునే సీఎం కెసీఆర్ అసలు పరిశీలనలో లేని వాసాలమర్రి పర్యటన ఆకస్మాత్తుగా పెట్టుకోవటం..ఎంపిక చేసిన 76 కుటుంబాల ఖాతాల్లో రేపే నిధులు జమ చేస్తామని ప్రకటించటం అంతా వ్యూహాత్మకంగానే సాగిందని చెబుతున్నారు.
అయినా కూడా ఏమైనా అవాంతరాలు ఎదురైతే ఆ బ్లేమ్ ను ఖచ్చితంగా కెసీఆర్ అండ్ కో విజయవంతంగా విపక్ష పార్టీల మీదకు తోసేయటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అంటే ఇప్పుడు కెసీఆర్ చెప్పినట్లు పైలట్ ప్రాజెక్టు హుజూరాబాద్ కాకుండా వాసాలమర్రి అయినట్లు అయింది. అంతే కాకుండా ఇది ఇప్పటికే అమల్లో ఉన్న స్కీమ్ గా మారబోతుంది. అందుకే ఇవాళే జీవో ఇప్పిస్తానని కూడా ప్రకటించారు సీఎం. ఇంత అకస్మాత్తుగా అర్హులను ఎంపిక చేసే ఛాన్స్ ఉన్నప్పుడు హుజూరాబాద్ నే పైలట్ కు ఎంచుకోవటం వెనక అసలు కథ ఏంటో పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జీహెచ్ంఎసీ ఎన్నికల సమయంలో వరద బాధితులకు సాయం విషయంలోనూ అదే జరిగింది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వెళ్లిందని ప్రతి ఇంటికి ఇచ్చే సాయాన్ని ఆపేశారు. అది ఇప్పటికీ ఇవ్వని విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే.