Telugu Gateway
Telugugateway Exclusives

సంపద సృష్టించగలిగే కెసీఆర్ భూములెందుకు అమ్ముతున్నారో?!

సంపద సృష్టించగలిగే కెసీఆర్ భూములెందుకు అమ్ముతున్నారో?!
X

'బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు సంపదను సృష్టించటంలో విఫలం అయ్యాయి. నేను వ్యక్తుల గురించి మాట్లాడటం లేదు. పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్ మెంట్) పేరుతో ప్రభుత్వ రంగ కంపెనీలను అమ్మి బడ్జెట్ కు నిధులు సమకూర్చుకుంటారా?. ఎల్ఐసిని అమ్మాల్సిన అవసరం ఏమి వచ్చింది. బీఎస్ఎన్ ఎల్ ను ఎవరి ప్రయోజనాల కోసం దెబ్బతీశారు. జాతీయ పార్టీలుగా చెప్పుకునే ఆ రెండు పార్టీలు సంపద సృష్టించటంలో విఫలం అయ్యాయి. మన జీడీపీ 24 శాతం మేర పతనం అయింది. మరో వైపు ఎక్కడో వెనకబడి ఉన్న చైనా దూసుకెళుతోంది. కొత్త తరహా రాజకీయాలు రావాలని చాలా మంది కోరుతున్నారు. అందుకు నేనే శ్రీకారం చుట్టొచ్చు' అని వ్యాఖ్యానించారు సీఎం కెసీఆర్. టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తోపాటు బిజెపి ప్రభుత్వాలు కూడా కేంద్రంలోని పలు సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ చేసిన మాట వాస్తవం. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఓ వైపు బిజెపి, కాంగ్రెస్ లకు సంపద సృష్టించటం రాదని చెబుతున్న టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ తన బడ్జెట్ అవసరాల కోసం హైదరాబాద్ తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూములను భారీ ఎత్తున అమ్మాలని ప్రతిపాదించారు. అంతే కాదు భూముల అమ్మకం గురించి స్వయంగా బడ్జెట్ లో కూడా ప్రస్తావించారు.

మరి కెసీఆర్ చెబుతున్నట్లు బిజెపి, కాంగ్రెస్ లకు చేతికాని సంపద సృష్టి తెలిసిన కెసీఆర్ అలా 'సృష్టించకుండా' బడ్జెట్ అవసరాల కోసం భూములను అమ్మాలని ప్రతిపాదించటం వెనక మతలబు ఏమిటి?. కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు కంపెనీలు అమ్ముతుంటే కెసీఆర్ భూములు అమ్మి బడ్జెట్ వనరులు సమకూర్చుకుంటారా?. ఇందులో కొత్తదనం ఏముంది?. వాస్తవానికి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో కూడా భూములు అమ్మాలని ప్రతిపాదించారు. కరోనా కారణంగా ఈ ప్రక్రియ ఆగిపోయింది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 2200 ఎకరాల భూములను విక్రయించటం ద్వారా ఏకంగా ఖజానాకు 20000 కోట్ల రూపాయలు జమ చేయాలని ప్రతిపాదించారు. మరి కెసీఆర్ దృష్టిలో ఈ భూముల విక్రయం కూడా సంపద సృష్టి కిందకే వస్తుందా?.

Next Story
Share it