Telugu Gateway
Telugugateway Exclusives

ఈ గోకుడు విరామం తాత్కాలికమా... లిక్కర్ స్కాం లెక్కల సెటిల్మెంట్ వ్యవహారమా?

ఈ గోకుడు విరామం తాత్కాలికమా... లిక్కర్ స్కాం లెక్కల సెటిల్మెంట్ వ్యవహారమా?
X

తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన కెసిఆర్ తీరు

‘మాతో పెట్టుకుంటే అగ్గితో గోక్కున్నట్లే. నువ్వు గోక్కున్నా..గోక్కోపోయినా..నేను మాత్రం గోకుతూనే ఉంటా’ ఇదీ కొద్ది రోజుల క్రితం బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన మాటలు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారినట్లు కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బిఆర్ఎస్ అధినేత, సీఎం కెసిఆర్ ప్రధాని మోడీ గోకుడు పూర్తిగా ఆపేశారు. గోకి గోకి చేయి నెప్పి పెట్టిందా..లేక దీని వెనక మీడియా లో వచ్చినట్లు లిక్కర్ స్కాం లెక్కలు ఉన్నాయా?. ఇప్పుడు ఇదే తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్. కెసిఆర్ గత రెండు జిల్లాల పర్యటనలో అసలు బీజేపీ పార్టీ ఒకటి ఉంది అన్న సంగతి మర్చి పోయి కాంగ్రెస్ పై మాత్రమే విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విమర్శలకు అతీతం అని ఎవరూ చెప్పరు కానీ...నువ్వు గోక్కున్నా..గోక్కోపోయినా..నేను మాత్రం గోకుతూనే ఉంటా వంటి భీషణ ప్రతిజ్జలు చేసిన కెసిఆర్ ఇప్పుడు ఎందుకు రివర్స్ గేర్ వేశారు అన్నదే ఇక్కడ చర్చనీయాంశం. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అధికారంలో ఉన్న వాళ్ళు సహజంగానే ప్రత్యర్థి పార్టీలు అన్నింటిపై విమర్శలు చేస్తూ ఉంటారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై కెసిఆర్ గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఎటాక్ చేసి అకస్మాత్తుగా మౌనం దాల్చటం వెనక కారణాలు ఏమి అయి ఉంటాయా అన్న చర్చ సాగుతుంది. ఇది తాత్కాలికమా లేక ఎన్నికల వరకు ఇదే పరిస్థితి ఉంటుందా అన్నది చూడాల్సి ఉంది అని...ఎన్నికల సమయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తే మాత్రం బిఆర్ఎస్ కు భారీ నష్టం తప్పదు అని బిఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ కవిత పై వచ్చిన లిక్కర్ స్కాం ఆరోపణలు పక్కా నిజం అని ప్రజలు ఒక నిర్దారణకు వస్తారని...ఈ కేసు నుంచి బయటపడేందుకే మోడీ ని గోకటం ఆపేశారు అనే చర్చ కూడా తెరమీదకు వస్తుంది అని ఒక మంత్రి వెల్లడించారు. ఎలా చూసినా తమకు ఈ సారి చిక్కులు తప్పేలా లేవు అనే టెన్షన్ లో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఇప్పటికే పలు అంశాల్లో బిఆర్ఎస్ ప్రజల్లో వ్యతిరేకత మూట కట్టుకుంది. వీటికి ఇప్పుడు లిక్కర్ స్కాం ఒక బోనస్ అంశం లాగా మారింది అని చెపుతున్నారు.

Next Story
Share it