Telugu Gateway
Telugugateway Exclusives

కెసీఆర్ 'ఉత్తమ్' ను వదిలేశారు..ఈటెలను టార్గెట్ చేశారు!

కెసీఆర్ ఉత్తమ్ ను వదిలేశారు..ఈటెలను టార్గెట్ చేశారు!
X

అవినీతి విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా?

ఈ 'టార్గెట్' అవినీతి లెక్కల మతలబు ఏమిటి?

పైన కన్పిస్తున్న 'క్లిప్పింగ్' తెలంగాణ టుడే పత్రిక వెబ్ సైట్ లోనిది. 2018 నవంబర్ 24న ప్రచురితం అయింది. ముఖ్యమంత్రి కెసీఆర్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ మళ్లీ తాను అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నేతల అవినీతిని కక్కిస్తానని ప్రకటించారు. కానీ కెసీఆర్ రెండవ సారి అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటిపోయింది కూడా. కానీ స్వయంగా కెసీఆర్ 5000 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు చేసిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఇప్పటివరకూ ఈగ కూడా వాలలేదు. అంతే కాదు.. రెండేళ్ళు దాటినా ఈ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకుపడిన దాఖలాలు లేవు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో భారీ స్కామ్ జరిగిందని..ఈ అవినీతికి సంబంధించి విచారణ సంస్థల నివేదికలు కూడా ఉన్నాయని కెసీఆర్ పలుమార్లు ప్రకటించారు. కానీ కెసీఆర్ చెప్పిన ఐదు వేల కోట్ల రూపాయల అక్రమాలకు సంబంధించి కానీ..మరో అంశంలో కానీ చర్యలు శూన్యం.

ఆధారాలు ఉన్నా కూడా వెంటనే అవినీతిపై చర్యలు తీసుకోలేదని ఓ ముఖ్యమంత్రి చెప్పటమే ఓ విశేషం. కానీ ఇప్పుడు సొంత పార్టీ నాయకుడు, టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కెసీఆర్ వెంట ఉన్న ఈటెల రాజేందర్ విషయంలో సీఎం కెసీఆర్ స్పీడ్ చూస్తున్న వారు అవాక్కు అవుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పలు సైటెర్లు పడుతున్నాయి. కెసీఆర్ సర్కారు 'వాయువేగ' సర్కారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరి వాయువేగ చర్యలు ఒక్క ఈటెల విషయంలోనే ఎందుకు?. మరి సీఎం కెసీఆర్ స్వయంగా ప్రకటించిన ఐదు వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు వదిలేసినట్లు?. నిజంగా ఈటెల రాజేందర్ తప్పుచేసినా..అవినీతి చేసినా చర్యలు తీసుకుంటే ఎవరూ ఆక్షేపించరు. కానీ ఇదే టీఆర్ఎస్ సర్కారులోని మంత్రి మల్లారెడ్డితోపాటు ఎంతో మందిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.

కానీ వాటి విషయంలో ఎక్కడాలేని స్పీడ్ మాత్రం ఒక్క ఈటెల రాజేందర్ విషయంలో ఉండటంతో ఇది అంతా 'టార్గెట్'గా సాగుతుందనే విషయం స్పష్టం అవుతోందని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే తాజా పరిణామాలు చూసిన పార్టీ నేతలు కూడా ఇది చూసి ఒకింత షాక్ కు గురవుతున్నారు. పార్టీలో ఉంటూ ఎవరు 'ధిక్కార' స్వరాలు విన్పించినా ఎలా ఉండబోతుందో ఈటెల విషయంలో వ్యవహరించిన తీరు ద్వారా కెసీఆర్ అందరికీ సంకేతాలు పంపారని..ఇది ఒక రకమైన షాక్ ట్రీట్ మెంట్ లాంటిది అని ఓ నేత వ్యాఖ్యానించారు. స్వయంగా తాను ఐదు వేల కోట్ల రూపాయల అవినీతి చేశారని ప్రకటించిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి జోలికి ఏ మాత్రం పోకుండా ..సొంత పార్టీ నేత ఈటెల విషయంలో వరస పెట్టి విచారణలు చేస్తున్నారంటే దీని వెనక బలమైన కారణాలు ఉన్నాయని అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది.

Next Story
Share it