Telugu Gateway
Telugugateway Exclusives

'మోడీ మోడల్ మానిటైజేష‌న్' తో ఎవ‌రికి లాభం..ఎవ‌రికి న‌ష్టం?

మోడీ మోడల్ మానిటైజేష‌న్ తో ఎవ‌రికి లాభం..ఎవ‌రికి న‌ష్టం?
X

నిధులు కేంద్రానికి...లాభాలు ప్రైవేట్ కు...భారం ప్ర‌జ‌ల‌కు

ఒక‌టి కాదు..రెండు కాదు...ఏకంగా ఆరు ల‌క్షల కోట్ల రూపాయ‌లు. మోడీ స‌ర్కారు త‌ల‌పెట్టిన నేష‌న‌ల్ మానిటైజేష‌న్ పైప్ లైన్ ద్వారా స‌మీక‌రించ‌ద‌ల‌చిన డ‌బ్బు. దీని వ‌ల్ల ఎవ‌రికి న‌ష్టం?. ఎవ‌రికి లాభం. మోడీ స‌ర్కారు త‌ల‌పెట్టిన ఈ భారీ స్కీమ్ తో అంతిమంగా న‌ష్ట‌పోయేది సామాన్య‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లే. ఎలాంటి లాభం లేకుండా ప్రైవేట్ సంస్థ‌లు ప్ర‌భుత్వ రంగానికి చెందిన ఈ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టుల‌ను ఎందుకు తీసుకుంటాయి. ఈ ప‌థ‌కం కింద‌కు రానున్న ప్రాజెక్టుల విష‌యాల‌ను చూస్తే అస‌లు దోపిడీ ఎలా జ‌ర‌గ‌బోతుందో అర్ధం అవుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు విమానాశ్ర‌య ప్రాజెక్టుల‌ను చూసుకుందాం. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ‌ ఆధీనంలో ఉన్న వాటిని ప్రైవేట్ సంస్థ‌ల‌కు అప్పగిస్తారు. ఏఏఐ ఆధీనంలో ఉన్న విమానాశ్ర‌యంలో ఒక్కో ప్రయాణికుడిపై 150 రూపాయ‌లు యూడీఎఫ్ వ‌సూలు చేస్తే..అదే ప్రైవేట్ కు వెళితే ఆ ఛార్జీ తేలిగ్గా రెట్టింపు అవుతుంది. విమానాశ్ర‌యాన్ని ప్రైవేట్ కు అప్ప‌గించ‌టం వ‌ల్ల కేంద్రానికి డ‌బ్బులు వ‌స్తాయి. ప్రైవేట్ కు లాభాల పంట ప‌డుతుంది. అంతిమంగా ఆ భారం ప‌డేది ప్ర‌జ‌లు అంటే విమానాశ్ర‌యం ఉప‌యోగించే ప్ర‌యాణికుల‌పైనే. రైల్వేలు అయినా..ఓడ‌రేవులు అయినా...ర‌హ‌దారులు అయినా సేమ్ సీన్.వేల కోట్ల రూపాయ‌ల ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ప్రైవేట్ కు అప్ప‌గించి వాటితో వ్యాపారం చేసుకునే అవ‌కాశం వారికి క‌ల్పించి ఆస్తులు ప్ర‌భుత్వం చేతిలోనే ఉంటాయ‌ని చెప్ప‌టం అంటే ప్ర‌జ‌ల‌ను వంచించ‌ట‌మే. ఆయా ఆస్తుల‌ను లీజుకు ఇచ్చే కాల‌ప‌రిమితిని బ‌ట్టి కొన్నిత‌రాలు ఆ ప్ర‌భావం భ‌రించాల్సి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు పీపీపీ ప‌ద్ద‌తిలో విమానాశ్ర‌యాల‌ను అప్ప‌గించిన ప‌ద్ద‌తి చూస్తే ..తొలుత 33 సంవ‌త్స‌రాలు త‌ర్వాత మ‌రో 33 సంవ‌త్స‌రాలు పొడిగించుకునేలా వెసులుబాటు క‌ల్పిస్తారు. అంటే ఏకంగా 66 సంవ‌త్స‌రాలు. ప్రైవేట్ సంస్థ‌లు..ప్ర‌భుత్వాల మ‌ధ్య అంగీకారం ఉంటే మ‌రో 33 సంవ‌త్స‌రాలు కూడా పొడిగింపు ఉంటుంది.

అంటే కొన్ని త‌రాలు పాటు ప్రైవేట్ సంస్థ‌లు వ‌సూలు చేసే ఫీజులు ప్ర‌యాణికులు భ‌రించాల్సిందే. కేంద్రంలోని మోడీ స‌ర్కారు ఇప్పుడు రైళ్ళు, స్టేడియాలు, రోడ్ల‌ను కూడా మానిటేజేష‌న్ అనే పేరు చెప్పి ప్రైవేట్ ప‌రం చేస్తోంది. అంటే ప్ర‌భుత్వం తాను అనుకున్న మొత్తాల‌ను వీటి ద్వారా స‌మీక‌రించి..త‌మ‌కు రాజ‌కీయంగా అవ‌స‌రం అయ్యే పనులు చేసుకుంటాయ‌న్న మాట‌. అయితే ఆ భారం మోయాల్సింది మాత్రం ప్ర‌జ‌లే. ఆస్తులు అన్నీ ప్ర‌భుత్వం చేతిలోనే ఉంటాయ‌ని చెప్ప‌టం అంటే నేరుగా ఇంత భారీ స్థాయిలో ప్రైవేటీక‌ర‌ణ అంటే విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌నే మోడీ మానిటేష‌న్ మోడ‌ల్ ను ఎంచుకున్న‌ట్లు క‌న్పిస్తోంద‌ని అధికార వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అత్యంత ర‌ద్దీగా ఉంటే జాతీయ ర‌హ‌దారుల‌ను మానిటైజేష‌న్ లో భాగంగా ప్రైవేట్ కు అప్ప‌గిస్తే..వాటి ప‌క్క‌న ఉన్న స్థ‌లాల‌ను కూడా అప్ప‌గిస్తారు. టోల్ తోపాటు అక్క‌డ నిర్మాణాలు చేప‌ట్టి..ప్రైవేట్ సంస్థ‌లు లాభాలు ద‌క్కించుకుంటాయ‌ని..ఇది అంతా ఓ ప‌ద్ద‌తి ప్ర‌కార‌మే సాగుతోంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Next Story
Share it