జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ 'శిల్పి' ఎక్కడ?!
జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రచారం చేయరా?
పార్టీ అభ్యర్ధులను గెలిపించాల్సిన బాధ్యత లేదా?
చర్చనీయాంశం అవుతున్న టీడీపీ నేతల తీరు
తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎన్నికలు అంటే ఓ వ్యసనం. ఎన్నిక ఏదైనా చంద్రబాబు డీల్ చేసే తీరు వేరేగా ఉంటుంది. ఇందులో ఆయన రకరకాల పద్దతులు అనుసరిస్తుంటారు. అది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చంద్రబాబు ఊసే లేకుండా ఎందుకు పోయింది. టీడీపీ ఈ ఎన్నికల్లో ఏకంగా వందకుపైగా సీట్లలో బరిలో నిలిచింది. వాస్తవానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ పార్టీనే ఎప్పుడో వదిలేశారు. కానీ ఈ సమయంలో టీడీపీ అనూహ్యంగా పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో నిలిచింది. కానీ ఈ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ అసలు ఎందుకు ప్రచారం చేయటం లేదు?.
ఓ వైపు టీడీపీ సోషల్ మీడియా టీమ్ లు మాత్రం హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఎంత ఉందో చెబుతూ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు.. కానీ అందులో తప్పుపట్టాల్సింది ఏమీ లేదు. కానీ స్వయంగా ఎన్నికల ప్రచారంలోకి ఎందుకు రావటం లేదు. అసలు హైదరాబాద్ అభివృద్ధిలో సింహభాగం వాటా తనదే (స్వయంప్రకటిత శిల్పి) అని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు ఈ ఎన్నికల్లో పార్టీ ప్రయోజనాల కోసం..టీడీపీ అభ్యర్ధుల గెలుపు కోసం ఎందుకు బయటకు రావటంలేదు. పోనీ చంద్రబాబు అంటే ఏదో కరోనా భయంతో రావటం లేదు అనుకుందాం కాసేపు. మరి ఆయన తనయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రచారం చేయటానికి ఏమైంది?.
జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఉన్న ఆయనకు అత్యంత కీలకమైన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను గెలిపించాల్సిన బాధ్యత లేదా?. అలాంటప్పుడు ఎందుకు ఇంత భారీ స్థాయిలో అభ్యర్ధులను బరిలోకి దింపినట్లు?. దీని వెనక కూడా ఎవరికో మేలు చేయాలనే ఆలోచన ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అసలు ఎన్నికలు అంటే చాలు ఎంతో ఉత్సాహం చూపే చంద్రబాబు ఈ వైఖరి అనుసరించటం వెనక బలమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు పాత్ర విస్మరించలేనిదే. అందులో ఎలాంటి సందేహంలేదు. ముఖ్యంగా సైబరాబాద్ ప్రాంతం లో కీలక మార్పులు ఆయన హయాంలో జరిగినవే. తర్వాత వచ్చిన వైఎస్ కూడా వాటిని కొనసాగించారు. కాకపోతే చంద్రబాబు మాటలే కాస్త ఇక్కడి ప్రజలను ఇబ్బందికి గురిచేస్తాయి. అసలు హైదరాబాద్ అభివృద్ధి అంతా తానే చేశానని, తన వల్లే హైదరాబాద్ ఈ స్థితిలో ఉందనే తరహాలో చంద్రబాబు చేసే వ్యాఖ్యలు వివాదాన్ని రేపేవి. అంత ఎందుకు తాజాగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా భారీ పెట్టుబడి ప్రకటన చేసింది. ఇది కూడా తన వల్లే అన్న తరహాలో వ్యాఖ్యానించి చంద్రబాబు కలకలం రేపారు. బహుశా జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనుకుంటా. అధికార టీఆర్ఎస్ నేతలు కూడా ఈ మాటలను పెద్దగా పట్టించుకోకుండా వదిలేశారు. లేక పోతే కథ వేరే ఉండేది.